సర్కిల్ 20 పరిధిలో అక్రమ నిర్మాణలను సీజ్ చేసిన అధికారులు
శేరిలింగంపల్లి డిసెంబర్ 21(ప్రజాక్షేత్రం):శేరిలింగంపల్లి సర్కిల్-20 పరిధిలోని ఆక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలోని ఆక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు ఏకంగా సీజ్ మంత్రం పాటిస్తున్నారు. శనివారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్‌నగర్‌లో పోలీసు బందోబస్త్ నడుమ ఏకంగా 10 అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. ఇప్పటికే గత శనివారం 6 భవనాలను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా గుర్తించి సమస్యలు తలెత్తకుండా నోటీసులు జారీ చేసి సీజ్ చేస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనుమతులు ఉన్నంత వరకు నిర్మాణాలు చేయాలని, అదనపు అంతస్తులు చేపట్టిన ఇదే తంతు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ జీషన్, చైన్‌మెన్ ఐలయ్య, నెట్ ఇంజనీర్స్ మధుకర్ రెడ్డి, మిత్ర, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
