ఈ ప్రిన్సిపల్ మాకు వద్దు
– గురుకుల విద్యార్థుల ధర్నా
– అదనపు కలెక్టర్ హామీతో ధర్నా విరమణ
జోగిపేట డిసెంబర్ 21(ప్రజాక్షేత్రం): ప్రిన్సిపల్ మాకు వద్దంటే వద్దు అంటూ అందోల్ గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం ఉదయం పాఠశాల మెయిన్ గేటు ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ సద్గుణ మేరీ గ్రేస్ పై విద్యార్థులు పలు ఆరోపణలు చేశారు. ఆమె సొంత కారును కడిగించుకోవడం, ఆమె పర్సనల్ రూమ్ శుభ్రం చేయించుకోవడం, ఆమె తిన్న ప్లేటు కడిగించుకోవడం, అకారణంగా తిట్టడం వంటి ఆరోపణలతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఆకారణంగా పిడిని, ఇతర కాంట్రాక్టు లెక్చరర్ లపై వేటు వేస్తున్నారని, దీంతో మాకు సిలబస్ ఇబ్బంది అవుతుందని వారు తెలిపారు. ధర్నా వద్దకు సీఐ అనిల్ కుమార్, పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆర్డిఓ పాండు, తహశీల్దార్ విష్ణు సాగర్, ఉపా తహశీల్దార్ మధుకర్ రెడ్డిలు విద్యార్థుల వద్దకు వచ్చి వారు చెప్పిన విషయాలను విని సముదాయించే ప్రయత్నం చేశారు. పిఆర్టియు జిల్లా అధ్యక్షులు ఆకుల మానయ్య విద్యార్థుల ధర్నా వద్దకు వచ్చి వారికి మద్దతు పలికారు. ప్రిన్సిపాల్ వైఖరిపై జిల్లా అధికారులకు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో వారు ధర్నాలు విరమించి లోనికి వెళ్లారు. విద్యార్థుల ధర్నాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ పాఠశాలకు వచ్చారు. విద్యార్థులు, ప్రిన్సిపల్ తో వేరువేరుగా మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీని ఇచ్చారు.