మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
-శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని కన్నుమూశారు
-ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ఆయన మృతిని ధ్రువీకరించారు
హైదరాబాద్, డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో గురువారం 26 డిసెంబర్ 2024 మృతి చెందారు. కాసేపటి క్రితమే ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ ఎయిమ్స్‌లో చేరారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. దీనికి ముందు, ఆయన భారతదేశానికి ఆర్థిక మంత్రి , ఆర్థిక కార్యదర్శిగా కూడా ఉన్నారు. నరసింహారావు ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి కోసం వచ్చి కర్ణాటకలోని బెలగావిలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హుటాహుటిని ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ప్రియాంక గాంధీ కాసేపటి క్రితమే ఎయిమ్స్‌కు వచ్చారు. పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ కూడా కాసేపట్లో ఎయిమ్స్‌కు చేరుకునే అవకాశం ఉందని సమాచారం. సింగ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బెలగావిలో సిడబ్ల్యుసి సమావేశంలో భాగంగా జరగాల్సిన ర్యాలీని కాంగ్రెస్ రద్దు చేసింది. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేసిన సింగ్, ఈ ఏడాది ప్రారంభంలో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. సింగ్ 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఆయన మే 22, 2004న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22, 2009న మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 33 ఏళ్ల క్రితం 1991లో రాజ్యసభలో సింగ్ తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. పివి నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో BA, MAలో టాపర్‌గా నిలిచారు. తర్వాత కేంబ్రిడ్జ్‌కి వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్ D ఫిల్ పొందారు – మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ వైపు నడిపించారు. మన్మోహన్ సింగ్ అంకిత భావానికి నిదర్శనం ఆయన తన పదవీ కాలమంతా సభకు హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నా సరే వీల్ చైర్‌లో కూడా వచ్చారు. పార్లమెంటులో తన చివరి ప్రసంగం నోట్ల రద్దుపై మాట్లాడారు. అది “వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధమైన దోపిడీ” అని విమర్శించారు.