ఎస్సీ వర్గీకరణ అమలు చేయించడమే ఏకైక లక్ష్యం
-మంద కృష్ణమాదిగ
హైదరాబాద్ డిసెంబర్ 27(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేశామని, మాదిగల పోరాటంలో న్యాయబద్ధతను గ్రహించి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. గురువారం అల్వాల్ లోతుకుంటలో ఎమ్మార్పీ ఎస్ తెలంగాణ రాష్ట్ర అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం వల్ల దక్కిన విజయ ఫలాలను అందుకునే సమయంలో ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి మాల సామాజికవర్గంలోని కొంతమంది స్వార్థపరులు కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకుల కుట్రలను ఎదుర్కొవడానికి మాదిగ కళానేతలతో వెయ్యి గొంతులు-లక్ష డప్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కొన్నేళ్లుగా సమాజ వికాసం కోసం మోగిన డప్పులు ఈసారి జాతి విముక్తి కోసం మోగబోతున్నాయన్నారు. వెయ్యి గొంతులు- లక్ష డప్పులు కార్యక్రమంతో వర్గీకరణ వ్యతిరేకుల కుట్రలను తిప్పికొడుతామన్నారు. డప్పులను సంకకు వేసుకొని లక్షలాదిగా మాదిగ బిడ్డలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాకారుడు ఏపూరి సోమన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌నరేష్ మాదిగ, మచ్చ దేవేందర్, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, జాతీయ ప్రధానకార్యదర్శి కోళ్ల శివ మాదిగ, బిక్షపతి మాదిగ, మహిళా రాష్ట్రనాయకురాలు లతమాదిగ, బైరవపోగు శివకుమార్‌మాదిగ, తదితరులు పాల్గొన్నారు.