చక్రం తిప్పుతున్న వీఆర్వోలు
-ఆఫర్ చేస్తేనే ఆన్లైన్
-అధికారుల చుట్టూ రైతులు
సిరివెళ్ల డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):రెవెన్యూ కార్యాలయంలో కొందరు వీఆర్వోలు చక్రం తిప్పుతుండడంతో రైతులు వారి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. పాత వెబ్ ల్యాండ్ ఉన్న భూమి, కొత్త వెబ్ లో లేకపోవడంతో ఉన్న భూమి రికార్డుల్లో లేకుండా పోతుందని రైతులు కొందరు వీఆర్వోల చుట్టూ తిరిగి చమట కార్చుకుంటున్నారు. శిరివెళ్ల మండలంలోని కొన్ని గ్రామాలు ఉండగా వాటిలో కొన్ని గ్రామాలకు మాత్రమే రీ సర్వే జరిగింది. వీటిలో కొన్ని గ్రామాలకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వగా, మరికొన్ని గ్రామాలకు ఇవ్వలేదు. జరిగిన కొన్ని గ్రామాలలో కూడా అవకతవకతలు జరగాయని ఆరోపణలు రావడం వల్ల వాటి విషయం మీద అడగగా వారికి పుస్తకాల పంపిణీ నిలుపుదల చేశారు. మళ్లీ రీ సర్వే జరపాలని రైతులు డిమాండ్ చేశారు. చాలా గ్రామాల్లో రైతులకు ఉన్న భూమి కంటే తక్కువ భూమి 1బిలో ఉండడంతో లబోదిబోమంటూ వీఆర్వోల చుట్టూ తిరిగి తమ భూమి యధావిధిగా ఉండేటట్లు చేయాలని కోరి వారికి తాంబూలాలు సమర్పిస్తున్నారు. ఆఫర్ లేనిదే ఆన్లైన్ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పాత పాసు పుస్తకాల్లో భూమి యధావిధిగా ఉన్న ఆన్లైన్లో తక్కువ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు కావాలని రైతులకు ఉన్న భూమిని తగ్గించి పక్కవారిలో కలపడంతో ఎక్కువ భూమి ఉన్న రైతు అధికారుల చుట్టూ తిరుగుతూ టెన్షన్ పడుతున్నారు. రీ సర్వే జరిపి సర్వేరు, వీఆర్వోలు కొలతలు వేసిన యదార్ధంగా వారికి ఉన్న భూమిని రికార్డులను నమోదు చేయించుకోవడానికి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఇక ఓపిక లేక తాంబూలం సమర్పించుకొని పనులు చేయించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రి సర్వే జరిపి రైతులు ఇబ్బంది పడకుండా వారి రికార్డు నమోదు చేయాలని కనీసం 1బి అప్డేట్ చేయాలని ఆదేశించిన చాలా గ్రామాల్లో ఆదేశాలు సైతం లెక్కచేయకుండా రెవెన్యూ కోసం పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న కొందరు కాసులకు కక్కుర్తి పడడంతో భూమి రికార్డులు కాకి రెక్కలలా ఉంటున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడకుండా వారికి ఉన్న భూమి మేరకు రికార్డు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.
తహసిల్దార్ వివరణ
వీటిపై సిరివెళ్ల తాసిల్దార్ పుష్పకుమారి వివరణ కోరగా రైతులు ఎవరికీ డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని గ్రామాల్లో ఉండే సచివాలయంలో వారు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. రైతులు సమస్యలు పరిష్కారం కోసమే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
