న్యూ ఇయర్ ఫస్ట్ రోజే.. రికార్డ్ బద్దలు కొట్టిన మద్యం ప్రియులు..
హైదరాబాద్ డిసెంబర్ 01(ప్రజాక్షేత్రం):ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్.. వంద మందిని పంపించు.. అనే డైలాగ్ తగినట్లుగానే, ఒక్కొక్కరు కాదు బ్యాచ్.. బ్యాచ్ ల వారీగా తెగ త్రాగేశారు మద్యం ప్రియులు. అందుకే ప్రభుత్వ ఖజానా కూడ గలగలమంది. న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ, సంబరాలు జోరుగా సాగాయి. ఎటుచూసినా అర్దరాత్రి బాణసంచాలు కాలుస్తూ, యువకులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. కొందరు మాత్రం గృహాలకే పరిమితమై ఫుల్ లాగిస్తే, మరికొందరు మాత్రం ఫుల్ కిక్కులో బైక్స్ రైడ్ చేసి పోలీసులకు పట్టుబడ్డారు. అయితే న్యూ ఇయర్ ఏమో కానీ, మద్యం కొనుగోళ్లు మాత్రం రికార్డు స్థాయిలో సాగాయని చెప్పవచ్చు. డిసెంబర్ 31 ఉదయం నుండి మద్యం కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, యువకులు ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. అలాగే మద్యం ప్రియులు కూడా ముందుగానే పెద్ద ప్లాన్ వేసి, పార్టీలు జోరుగా సాగించారు. ఆ పార్టీల జోరు అలా ఉంచితే, బ్రాండెడ్ మద్యం విక్రయాలు మాత్రం జోరుగా సాగాయి. అధికంగా బీర్ బాటిల్స్ కొనుగోళ్లకు మద్యం ప్రియులు ఆసక్తి చూపారని తెలుస్తోంది. మండల కేంద్రాల్లోని వైన్స్ షాపుల వద్ద భారీ క్యూలే కనిపించాయి. ఏపీలో అయితే బ్రాండెడ్ మద్యం అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణలో అదే రీతిలో ఎక్సైజ్ శాఖ మద్యం కొరత లేకుండా అన్నీ చర్యలు తీసుకుంది. దీనితో మద్యం ప్రియులు రావడమే తరువాయి, మద్యం సీసాలు కొనుగోళ్లు జోరుగా సాగాయి. తెలంగాణలో మాత్రం ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఊహించని రీతిలో అమ్మకాలు సాగినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 28 నుండి జనవరి 1 ఉదయం వరకు రూ. 1800 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు సాగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. 31 రాత్రి మాత్రం రూ. 403 కోట్లకు పైగానే ఆదాయం వచ్చిందట. మందుబాబులు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు సాగించడంతో, ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వచ్చింది. ఏపీలో కూడా ఇదే తరహా మద్యం కొనుగోళ్లు జరగగా, అక్కడ కూడా ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చినట్లేనని తెలుస్తోంది. కానీ అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటన జారీ చేయాల్సిందే.