Praja Kshetram
తెలంగాణ

స్నేహా చికెన్ వ్యర్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు

స్నేహా చికెన్ వ్యర్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు

 

-కలుషిత నీరు త్రాగి క్యాన్సర్ బారిన పడుతున్న ప్రజలు

-కంపెనీ నుంచి వస్తున్న కంపుతో ఊపిరి తీసుకోలేక శ్వాసకోశ సమస్యలు

-ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలి

-బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి జనవరి 01(ప్రజాక్షేత్రం):అధికారుల అండదండలు…ప్రజాప్రతినిధుల అభయ హస్తంతో స్నేహ చికెన్ పరిశ్రమ యాజమాన్యం రెచ్చిపోతుందని, స్నేహ ఫార్మ్స్‌ నుంచి వచ్చే వ్యర్ధ పదార్ధాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందించి చర్యలు తీసుకోవాలని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండు చేశారు. బుదవారం అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామ చెరువు సమీపంలో స్నేహ చికెన్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను వారి ఇష్టా రాజ్యంగా కాలువలలో వదులుతున్నారని మండిపడ్డారు. స్నేహ ఫార్మ్స్‌ నుంచి వచ్చే వ్యర్ధ పదార్ధాలు పొలాలలో వదలడంతో అవి బలీదుపల్లి, పెద్దమునగల్ చేడు వాగులో కలిసి కలుషితమై సరళసాగర్ మీదుగా రామన్‌పాడు డ్యామ్‌లోకి వెళ్తున్నాయన్నారు. రామన్‌పాడు డ్యామ్‌ నుంచి సరఫరా అయ్యే కలుషితమైన నీరు తాగి పలువురు క్యాన్సర్‌, ఇతర రోగాల బారిన పడుతున్నారన్నారు.పెద్దమునగల్ చేడ్, బలీదుపల్లి శివారు మధ్యలో జహంగీర్ పీర్ దర్గా దగ్గర నెమలులు, జింకలు ఎక్కువగా ఉంటాయని, ఈ కలుషిత నీరు త్రాగి వాటితో పాటు పశువులు, గొర్రెలు కూడా చనిపోతున్నాయన్నారు. ప్రభుత్వ నిభందనలకు తూట్లు పొడుస్తూ… ప్రజల జీవితాలలో చెలగాటమాడుతున్న స్నేహ కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పరిశ్రమను మూసివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఎసి వనపర్తి జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, నాయకులు వెంకటన్న గౌడ్, అంజన్న యాదవ్, దేవర శివ, రమేష్ సాగర్, మల్లేష్ యాదవ్, మ్యాదరి రాజు, మహమూద్, తదితరులు పాల్గొన్నారు.

Related posts