శంకర్‌పల్లిలో ‘ఇస్తేమా’
-తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు
-4, 5 తేదీల్లో ఇస్లాం ఆవశ్యకతపై కార్యక్రమం
-అధిక సంఖ్యలో హాజరు కానున్న ముస్లింలు
శంకర్ పల్లి, జనవరి02(ప్రజాక్షేత్రం):ఈనెల 4, 5 తేదీల్లో శంకర్‌పల్లిలో నిర్వహిస్తున్న ఇస్తేమా (ఇస్లాం ఆవశ్యకత గురించి నిర్వహించే) కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సభకు 4 లక్షల మంది ముస్లింలు హాజరు కానున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి విచ్చేస్తున్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం సుమారు రూ.2 కోట్లు మంజూరు చేసింది. గతంలో జంబోరి నిర్వహించిన 166 ఎకరాల్లో ఇస్తేమా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సజావుగా జరిగేలా జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా శాఖల అధికారులకు బాధ్యతలను అప్పగించారు. ఇస్తేమాకు వచ్చేవారి కోసం రెండు ఆస్పత్రులను, ఏడు క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. షిప్టుల వారీగా వైద్య సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. స్నానం చేసేందుకు 120 బాత్‌రూమ్స్, 480 మూత్ర శాలలు, 3 వేలు మరుగుదొడ్లు, 4 వేల నల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పెద్ద వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వారందరికీ భోజనాల తయారీకి 25 కిచెన్ షెడ్లు నిర్మిస్తున్నారు. ప్రార్థనకు వెళ్లే ముందు కాళ్లు చేతులు కడుక్కునేందుకు 12 కుళాయిలు, కోటి లీటర్ల సామర్థ్యం ఉన్న 2 పెద్ద సంపులు ఏర్పాటు చేశారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు 500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. నలుగురు ఏసీపీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. పది పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు మూడు చిన్న ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 800 బస్సులు, 3 వేల కార్లు, 20 వేల బైకుల నిలిపేలా కోసం పార్కింగ్ సిద్ధం చేశారు. పోలీసులు ఉండేందుకు స్థానికంగా ఉన్న బద్ధం సురేందర్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాట్లు చేశారు. అలాగే మిషన్ భగీరథ నీరు, పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ చర్యలు తీసుకుంటున్నారు.
వాహనాల దారి మళ్లింపు
శంకర్‌పల్లి పట్టణంలో ఇస్లామిక్ కాంగ్రిగేషన్ నేపథ్యంలో ట్రాఫిక్ దారి మళ్లిస్తున్నట్లు చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం తెలిపారు. శంకర్‌పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ జనవరి 4, 5న శంకర్‌పల్లిలో ఇస్లామిక్ కాంగ్రిగేషన్ ఉన్నందున శుక్రవారం నుంచి 5వ తేదీ వరకు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు వివరించారు. తాండూరు, వికారాబాద్ నుంచి శంకర్‌పల్లి మీదుగా పటాన్‌చెరువు వెళ్లే భారీ వాహనాలు మోమిన్‌పేట్ మీదుగా సదాశివపేట్ నుంచి సంగారెడ్డి-పటాన్‌చెరు వెళ్లాలని చెప్పారు. తాండూరు, వికారాబాద్ నుంచి సంగారెడ్డి, బీడీఎల్, పటాన్‌చెరుకు వచ్చే భారీ వాహనాలు ముత్తంగి టోల్‌గేట్ వద్ద ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ -3 ద్వారా చేవెళ్ల టీఎ్‌సపీఏ-ఓఆర్‌ఆర్ ద్వారా వెళ్లాలని వివరించారు. పటాన్‌చెరు, సంగారెడ్డి నుంచి శంకర్ పల్లి వచ్చే భారీ వాహనాలను కంది వద్ద సదాశివపేట్ ద్వారా వికారాబాద్, తాండూరు, చేవెళ్లకు మళ్లిస్తామ న్నారు. పరిగి, షాద్‌నగర్ నుంచి సంగారెడ్డి, పటాన్‌చెరు వెళ్లే భారీ వాహనాలు శంషాబాద్ ఓఆర్‌ఆర్ నార్సింగ్-ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-3 మీదుగా ముత్తంగా టోల్‌గేట్ పటాన్‌చెరు-ముంబాయి హైవే వైపు.. సంగారెడ్డి, పటాన్‌చెరు, బీడీఎల్ నుంచి షాద్‌నగర్, పరిగి వైపు వచ్చే భారీ వాహనాలు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-3 మీదుగా ముత్తంగా టోల్‌గేట్-శంషాబాద్ ఎగ్జిట్-16 బెంగుళూరు హైవే-షాద్‌నగర్ మీదుగా వెళ్లాలని చెప్పారు. నార్సింగ్ నుంచి శంకర్‌పల్లికి వచ్చే భారీ వాహనాలను టీ ఎస్ పీఏ నార్సింగ్-మొయినాబాద్-చేవెళ్ల-వికారాబాద్ మీదుగా మ ళ్లించనున్నట్లు ఆయన వివరించారు.