నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
హైదరాబాద్ జనవరి 05(ప్రజాక్షేత్రం):జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాభవన్‌లో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించిన 20 మందికి ఆర్థిక సాయం అందజేశారు. సివిల్స్ ఇంటర్వ్యూ కు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. సింగరేణి ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని .. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. సివిల్స్‌లో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలని తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. బీహార్ నుంచి అత్యధికంగా సివిల్స్‌లో రాణిస్తున్నారని అన్నారు. అలాంటి ప్రత్యేక శ్రద్ధ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండాలని, వారికి ఆర్థికంగా సహకారం అందించాలని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా రూ.లక్ష సాయం అందిస్తున్నామని ప్రకటించారు. ఇది ఆర్ధిక సాయం కాదు… ప్రభుత్వం వారికి అందిస్తున్న ప్రోత్సాహంగా భావించాలని అన్నారు. కష్టంతో కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుందని చెప్పారు. ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్‌లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే 55143 ఉద్యోగ నియామకాలు చేపట్టామని గుర్తుచేశారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
14 ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని.. కానీ తాము అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామని ఉద్ఘాటించారు. మార్చి 31 లోగా 563 గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలను పూర్తిచేయబోతున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఆలోచించేది యువత భవిష్యత్ కోసమే అని చెప్పారు. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్నిరకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. దేశంలో అత్యధికంగా మన రాష్ట్రం నుంచి సివిల్స్‌లో ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతోందని అన్నారు. గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో అవకాశాలు ఎక్కువ అని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు రావాలని చెప్పారు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. తమ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుందని అన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.