పాత బస్తీలో రూ.కోటి గోల్డెన్ కైట్ కలకలం!
హైదరాబాద్ జనవరి 13(ప్రజాక్షేత్రం): సంక్రాంతి వచ్చిందంటే భాగ్యనగరంలో రంగురంగుల పతంగులను చిన్నా పెద్ద తేడా లేకుండా ఎగురవేస్తారనే విషయం తెలిసిందే. అయితే, తాజాగా హైదరాబాద్ పాత బస్తీలో రూ. కోటి కైట్ కలకలం రేపుతోంది. తాజాగా సోషల్ మీడియాలో కోటి రూపాయల గోల్డ్ కైట్ అంటూ గోల్డ్ మ్యాన్ అనే వ్యక్తి ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. మరోవైపు రూ. 40 లక్షల మాంజా అంటూ ప్రచారం చేశాడు. ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోటి రూపాయల పతంగి కోసం హైదరాబాద్ పాతబస్తీలోని యువత ఎగబడే అవకాశం ఉందన్నారు. అయితే, గోల్డెన్ కైట్ కోసం కొట్టుకుని తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే బాధ్యులు ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. గోల్డ్ మెన్‌ను అరెస్టు చేసి, కోటి రూపాయల కైట్‌ను స్వాధీనం చేసుకోవాలని నెటిజన్లు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారని గోల్డ్‌మెన్ అనే వ్యక్తిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
కోటి రూపాయల గోల్డెన్ కైట్ ఎగరేయలేదు: గోల్డ్‌మెన్ సూర్య
కోటి రూపాయల గోల్డెన్ కైట్‌పై గోల్డ్‌మెన్ సూర్య వివరణ ఇచ్చారు. తాను గోల్డ్ కలర్‌లో ఉన్న పతంగిని మాత్రమే ఎగురవేసినట్లు క్లారీటి ఇచ్చారు. కోటి రూపాయల గోల్డెన్ కైట్ ఎగరేయలేదని సూర్య క్లారిటీ ఇచ్చారు. తన మాటలను బయట వారు తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి పతంగుల పోటీ పెట్టలేదని, అదేవిధంగా తాను ఎలాంటి వీడియో పోస్ట్ చేయలేదన్నారు. అందరినీ నేను క్షమాపణ కోరుతున్నాను.. తాను కావాలని చేసిన ప్రచారం కాదని సూర్య ఆవేదన వ్యక్తం చేశారు.