చిలుకవాగు కల్వర్టులోకి దూసుకెళ్లిన బైకు
– అదుపుతప్పి పడిపోయిన యువకుడు
– వ్యక్తిని, బైకును వెలికి తీసిన స్థానికలు
– తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జీ వద్ద ఘటన
తాండూరు, జనవరి 13(ప్రజాక్షేత్రం):బైకు అదుపు తప్పడంతో ఓ యువకుడు చిలుక వాగు కల్వర్టులోకి దూసుకెళ్లాడు. ఈ ఘటన తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణం నుంచి కోడంగల్ వైపు ఓ యువకుడు బైకుపై వెళుతున్నాడు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న జాతీయ రోడ్డు పనుల్లో భాగంగా బ్రిడ్జీ సమీపంలోని చిలుక వాగు కల్వర్టు పనులు చేస్తున్నారు. అయితే బైకుపై వెళుతున్న యువకుడు కల్వర్టు వద్ద ఎలాంటి బారికేడ్లు లేకపోవడంతో అదుపుతప్పి బైకుతో పాటు వాగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే యువకున్ని, బైకును బయటకు తీశారు. యువకునికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కల్వర్టు పనులు చేపడుతున్న అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు. పనుల వల్ల ఎలాంటి బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా కల్వర్టు వద్ద జాగ్రత్తలు చేపట్టాలని కోరారు.