రేపు మీ పిల్లలు మిమ్మల్ని ఇలాగే బస్ స్టేషన్‌లో వదిలేస్తే?: వీసీ సజ్జనార్
వికరాబాద్ జనవరి 16(ప్రజాక్షేత్రం):వికారాబాద్‌లో సోమవారం రాత్రి బస్టాండ్‌లో ఒక వృద్ధురాలు తన కొడుకులు వదిలేసి వెళ్లిపోయారని వికారాబాద్ ఆర్టీసీ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. చలితో వణికిపోతున్న వృద్ధురాలిని చూసిన బస్టాండ్‌లో ఉన్న సిబ్బంది ఆమెకు భోజనం పెట్టించి.. పోలీసుల సహకారంతో కొంపల్లి అనాధ ఆశ్రమానికి పంపించారు. ఈ ఘటనపై గురువారం ఎక్స్ వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. అమ్మను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న పిల్లలే బస్ స్టేషన్‌లో ఇలా వదిలేయడం అమానవవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. జీవిత చరమాంకంలో ఆ కన్నపేగుకు కనీసం తోడుగా ఉండలేరా? ఇదేం దుర్మార్గం అంటూ నిలదీశారు. స్వార్థంతో బంధాలు, అనుబంధాలను సమాధి చేస్తూ.. ఏం సాధిస్తారు? అంటూ ప్రశ్నించారు. పేగు తెంచుకొని పుట్టిన కొడుకులే తల్లిదండ్రులను పట్టించుకోకుండా కర్కశంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. రేపు మీ పిల్లలు మిమ్మల్ని ఇలాగే బస్ స్టేషన్‌లో వదిలేసి వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండని తెలిపారు. కన్నవాళ్ల నుంచి ఆస్తులు కావాలి, కానీ కన్నవారు మాత్రం అవసరం లేదనే భావన సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. వృద్దురాలి బాధను చూసి చలించిపోయి మానవత్వంతో చేరదీసిన వికారాబాద్ డిపో ఆర్టీసీ సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.