కల్లు సీసాలో కట్లపాము కలకలం..రెండు గుటకలు వేయడంతో నోట్లోకి..
బిజినేపల్లి జనవరి 17(ప్రజాక్షేత్రం):నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉపశమనం కోసం ఓ కూలీ కల్లు తాగేందుకు వెళ్తే అందులో కట్ల పాము రావడం తో కంగు తిన్నారు. గురువారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులంతా కోపంతో కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు. కల్లు దుకాణంలో కల్లు సీసా కొని, రెండు గుటకలు వేయడం తో నోటి కాడికి రావడం తో దానిని ఉమ్మిలియడంతో అందులో నుంచి సుమారు ఆరు ఇంచుల కట్లపాము బయటపడింది. ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేంటని కల్తీ కల్లు తయారు చేసే యజమానిని ప్రశ్నించగా బిత్తిరి చూపులు చూశాడు. దీంతో కోపంతో రగిలి పోతూ గ్రామస్తులంతా దుకాణాన్ని కల్లు సీసాలను ధ్వంసం చేశారు. డబ్బులకు ఆశపడి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ యజమానులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేసే కల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖను కోరారు.