కొత్త రేషన్ కార్డు లిస్టులో మీ పేరు లేదా.. అయితే ఇలా చేయండి
హైదరాబాద్, జనవరి 21(ప్రజాక్షేత్రం): తెలంగాణలో చాలా సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించేలా కొత్త రేషన్‌కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందాలంటే ఈ రేషన్ కార్డులు ఎంతో కీలకం. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులకు ఎంపికైన వారి జాబితా విడుదలకానుంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది కూడా. అయితే పలు చోట్ల కొత్త రేషన్ కార్డుల జాబితా లీకులు అవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాబితాల్లో తమ పేర్లు లేవని టెన్షన్ పడుతున్నారు. అయితే జాబితాలో పేర్లు లేకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పటికే మంత్రులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతం కొనసాగుతుందని తెలిపారు. అలాగే గ్రామాల్లో జరిగే గ్రామ సభలో కొత్త రేషన్ కార్డులకు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. నేటి నుంచి (జనవరి 21) నుంచి జనవరి 24 వరకు కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే అనేక మంది తమ కుటుంబసభ్యులను రేషన్ కార్డుల్లో జత చేసేందుకు దరఖాస్తున్న చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 12,07,558 దరఖాస్తుల్లో…18,00,515 మందిని అర్హులుగా గుర్తించి రేషన్ కార్డుల్లో జోడిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రామ సభల్లో దరఖాస్తులు…
అలాగే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం గ్రామ, బస్తీ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈరోజు నుంచి 24 వరకు గ్రామ సభలను నిర్వహించనున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11,65,052 మందికి సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారాన్ని సిద్ధం చేసినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈరోజు నుంచి జరిగే గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని సీఎస్ చెప్పారు. అలాగే మరో 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కార్డుల సమాచారాన్ని అవసరాన్ని బట్టి వెల్లడిస్తామని తెలిపారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, అడ్రస్, ఫోన్ నంబర్, కులానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని సూచించారు.
జాబితాలో పేరు లేని వారు…
కొత్త రేషన్ కార్డు జాబితాలో పేర్లు లేని వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలి. వారు సమర్పించిన వివరాల ఆధారంగా అధికారులు వాటిని పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులను అందజేస్తారు. నగరాలు, పట్టణాల్లో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు సామాజిక కులగణలో అనేక మంది తమ రేషన్ కార్డులు లేదని చెప్పడంతో ఎన్యూమరేటర్లు వాటిని నమోదు చేసుకుని పై అధికారులకు పంపించారు. కులగణన సందర్భంగా రేషన్ కార్డుల సమస్యలు బయటపడ్డాయి. అర్హులైన వారి వివరాలు కూడా జాబితాలో లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కంప్యూటరీకరణ సమయంలో పేర్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 26 వరకు రేషన్ కార్డుల విషయంలో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఏ ప్రాతిపదికన జాబితాను సిద్ధం చేస్తున్నామనే విషయాన్ని కూడా ప్రజలకు చెబుతామని అధికారులు తెలిపారు.