అవినీతికి పాల్పడిన కొండకల్ పంచాయతీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
-గ్రామ సభలో అధికారులకు వింత అనుభవం
శంకర్‌పల్లి జనవరి 21(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామ సభలో మంగళవారం అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రత్యేక అధికారుల సమక్షంలో నిర్వహించిన గ్రామ సభలో భూ ఆక్రమణ పై ప్రజలు అధికారులను నీలదీశారు. కొండకల్ గ్రామంలో గత వందేళ్లుగా 360, 361, 362 నుంచి 400 సర్వే నంబర్ మధ్యలో ఉన్న భూములను సాగు చేసుకుంటున్నామని వాటిని ఆక్రమించుకుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు, గ్రామ కార్యదర్శి ఎల్లయ్య కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి తమకు సాగు భూములు లేకుండా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. సీలింగ్, అసైండ్ భూములు, చెరువులను సైతం ఆక్రమించుకుని తమ జీవనధారాన్ని నాశనం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూముల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించిన సందర్భంలో ఉన్నతాధికారులకు, గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. తమకు ఇబ్బంది కలిగేలా భూములను ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించినా.. స్పందించని అధికారులు, గ్రామ కార్యదర్శి పై తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ సభలో గ్రామస్తులు పట్టుబట్టారు. గ్రామ కార్యదర్శి ఎల్లయ్య పై, రెవిన్యూ అధికారుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సమిష్టిగా గ్రామ సభ జరగకుండా అడ్డుకున్నారు. కొద్దిసేపు గ్రామ సభలో గందరగోళం ఏర్పడింది. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.