Praja Kshetram
పాలిటిక్స్

ఇప్పుడు తెలంగాణాలో అన్ని పార్టీలు దీనిపైనే ఫోకస్.. ఎందుకో తెల్సా..?

ఇప్పుడు తెలంగాణాలో అన్ని పార్టీలు దీనిపైనే ఫోకస్.. ఎందుకో తెల్సా..?

 

హైదరాబాద్ జనవరి 30(ప్రజాక్షేత్రం):త్వరలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పుడు అన్నీ పార్టీలు ముఖ్యంగా కరీంనగర్ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ పెట్టారు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక మూడు పార్టీలకు ఇప్పుడు కీలకంగా మారింది. మూడు పార్టీలో ఆస్థానంలో గెలవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీటెక్కింది.కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోకి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు వస్తాయి. ఇక్కడ పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిచారు. దీంతో ఈసారి కూడా గెలివాలని హస్తం పార్టీ ఉవ్విళ్లురుతోంది. బీఆర్ఎస్ ఇంకా పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పటివరకు ఒక్క బీజేపీ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ మూడు, నాలుగు రోజుల్లో పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించనుంది. అభ్యర్థిని ప్రకటించడానికి కాంగ్రెస్ అధిష్టానం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతోంది. దీంతో మూడు పార్టీలు ఈ ఎన్నికను కీలకంగా తీసుకున్నాయి.అన్ని పార్టీల్లోని కీలక నేతలు కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజక పరిధలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు, నాయకులను ఆయన చురుకుగా ప్రజల్లోకి ఆదేశిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ వచ్చాక ఉద్యోగాల ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా కట్టుదిట్టంగా పరీక్షలో నిర్వహించింది. కాకపోతే గత ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్‌గా మారవచ్చు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి సరిగ్గా అమలు చేస్తే గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్ రావు ఇలా కీలక నేతలందరూ ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు. తమకు మంచి పట్టు ఉన్న నియోజకవర్గం కావడంతో పోటీ చేస్తే గెలవచ్చు బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. కాకపోతే పోటీ చేయాలా..? వద్దా..? అని యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. ఇక ఒకప్పుడు ఉత్తర తెలంగాణ పెద్దగా పట్టులేని బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది. ఒకప్పుడు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన కమలం ఇప్పుడు ఉత్తర తెలంగాణ పట్టు సాధించింది. ఇక్కడ నుంచే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, నలుగురు ఎంపీలు కూడా ఉన్నారు. పార్టీకున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఏ జిల్లాల్లోనే ఉన్నారు. ఈ బలంతోనే బీజేపీ ఎలాగైనా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచి రాష్ట్రంలో కమలం పార్టీని వ్యాపంపజేయాలని చూస్తోంది. ఇప్పటి నుంచి బీజేపీ గ్రామాల్లో యువతను పార్టీలో చేర్చుకునే పనిలోపడింది. మొత్తానికి ఇప్పుడు ప్రధాన పార్టీలు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపైనే గురిపెట్టాయి. మరీ ఏ పార్టీ గెలుస్తుందో వేచి చూద్దాం.

Related posts