స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ : మంత్రి పొంగులేటి
వైరా ఫిబ్రవరి 02(ప్రజాక్షేత్రం): ఈనెల 15న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడకలో ఆదివారం రాత్రి ఇటీవల మృతి చెందిన మేడా రాణి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మేడా రాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొంతమంది కాంగ్రెస్ నాయకులు సాదాబైనామా, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు అలాగే ఖరీఫ్లో మిగిలిపోయిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్లా ఖాన్ తో మంత్రి పొంగులేటి ఫోన్ చేసి ఖరీఫ్లో మిగిలిపోయిన రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో పుణ్యపురం గ్రామానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు పెండింగ్లో ఉన్న సాదాబైనామా గురించి ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు. వెంటనే మంత్రి స్పందించి సాదాబైనామా పరిష్కారానికి కేవలం ఒక్క నెల గడువు మాత్రమే ఇస్తామని అది కూడా ఈనెల 15న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని, ఎన్నికల ప్రక్రియ ముగిశాక భూభారతిలో ఒక నెలలో సాదాబైనామాల పరిష్కారానికి అవకాశం ఇస్తామని, ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వారికి ఇప్పుడు కేటాయించబోమని, పేదలకు మాత్రమే మొదటి ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ మాజీ చైర్మన్ సూతకాని జైపాల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, నాయకులు పణితి సైదులు, గుమ్మా రోశయ్య, మిట్టపల్లి నాగి, బాణోతు విజయ బాయి, నంబూరి కనకదుర్గ పాల్గొన్నారు.