రేషన్ కార్డుల దరఖాస్తుల్లో గందరగోళం
హైదరాబాద్ ఫిబ్రవరి 12(ప్రజాక్షేత్రం):రేషన్ కార్డులకు దరఖాస్తుల్లో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డుల కోసం ప్రజలు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. రసీదును సివిల్ సప్లై ఆఫీసులో ఇవ్వాలని మీసేవ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో రసీదులు తీసుకుని సివిల్ సప్లై కార్యాలయాని కి వెళ్తున్నారు. మీసేవ కేంద్రాలు, సివిల్ సప్లై కార్యాలయం వద్ద భారీగా రద్దీ పెరిగింది. రెండు చోట్ల గంటల కొద్దీ వేచిఉండాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవలో దరఖాస్తు చేశాక మళ్లీ రసీదు ఎందుకు ఇవ్వాలని ప్రజలు మండిపడుతున్నారు.
మీసేవ కేంద్రాల్లో భారీగా పెరిగిన రద్దీ
మీసేవ కేంద్రాల్లో భారీగా రద్దీ పెరిగింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం నుంచే మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం కూడా ప్రజలు తరలివస్తున్నారు. ఆధార్ కార్డు అప్ డేట్ కోసం కూడా భారీగా తరలివస్తున్నారు. జనం భారీగా వస్తుండటంతో మీసేవ కేంద్రాల వద్ద జనం కిక్కిరిసిపోతున్నాయి. మీసేవ కేంద్రాల వద్ద గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నామని ప్రజలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన రుసుం కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రద్దీ పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయంటూ మీసేవ నిర్వహకులు చెబుతున్నారు.