Praja Kshetram
తెలంగాణ

ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. మహిళను లాఠీతో చితకబాదిన బోధన్‌ రూరల్‌ సీఐ!

ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. మహిళను లాఠీతో చితకబాదిన బోధన్‌ రూరల్‌ సీఐ!

 

 

బోధన్ ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):బోధన్‌ రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌ దాష్టీకం తాజాగా వెలుగులోకి వచ్చింది. పర్స్‌ పోయిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు సాయం చేయాల్సిందిపోయి ఆమెపై కర్కశంగా వ్యవహరించాడు. నాకే ఫిర్యాదు చేస్తావా అంటూ బాధితురాలి తొడ, పిరుదుల భాగంలో వాతలు వచ్చేలా లాఠీతో దారుణంగా కొట్టాడు. అయితే, బోధన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి అండతోనే సీఐ విజయ్‌కుమార్‌ ఇంతగా రెచ్చిపోతున్నాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయ భాగ్య అనే మహిళ తన కుమారుడితో కలిసి ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లింది. తన కొడుక్కి ఆటబొమ్మలు కొనిచ్చే సమయంలో తన పర్సు పోయిందని భాగ్య గుర్తించింది. వెంటనే అక్కడే జాతరలో కనిపించిన కానిస్టేబుళ్లకు చెప్పింది. వాళ్లు కాసేపు వెతికారు.. కానీ ఎక్కడా పర్సు దొరకలేదు. అదే సమయంలో బ్రహ్మోత్సవాల డ్యూటీకి వచ్చి ఔట్‌పోస్టులో ఉన్న బోధన్‌ రూరల్‌ సీఐ విజయ్‌ బాబు దగ్గరకు భాగ్య వెళ్లి జరిగిన విషయం చెప్పింది. తన పర్సులో రూ.300, ఇంటి తాళం ఉన్నాయని తెలిపింది. కానీ ఆమెకు సాయం చేయాల్సిందిపోయి సీఐ కర్కశంగా వ్యవహరించాడు. ఫిర్యాదు చేసిన మహిళను దూషిస్తూ.. అనవసరంగా రాద్దాంతం చేస్తావా అంటూ లాఠీతో మహిళ అనే కనికరం చూడకుండా విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ ఘటనపై ఎడపల్లి పోలీసులకు భాగ్య ఫిర్యాదు చేసింది. మహిళ అనే కనికరం చూడకుండా దుర్భాషలాడుతూ.. లాఠీతో సీఐ విజయ్‌కుమార్‌ కొట్టారని తెలిపింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Related posts