వెనుకబడిన కులాలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి..
– కులాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా..
– జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ…
ముషీరాబాద్ ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):వెనుకబడిన కులాలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అన్ని కులాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర మాల దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెండ్ల సోమయ్య అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణలో మాల దాసరి కులాన్ని గ్రూప్ చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణలో అన్ని కులాలకు సమన్వయం జరగాలని ఎమ్మార్పీఎస్ మొదటి నుండి పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. మాల దాసరి కులం చేస్తున్న పోరాటానికి ఎమ్మార్పీఎస్ ఎల్లప్పుడు సంఘీభావంగా ఉంటుందని తెలిపారు. అన్ని రంగాలో అభివృద్ది చెందిన మాల సామాజిక వర్గం తోటి మాల దాసరి కులం విద్యా, ఉద్యోగ రంగంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని గుర్తు చేశారు. గత 30 ఏండ్ల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మాల దాసరి కులం ఎందుకు ఈ ఉద్యమంలో పాల్గొనలేదని అన్నారు. మాదిగల కోసమే జరుగుతున్న ఈ అన్ని వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని అన్నారు. ఏ కులానికి అన్యాయం జరిగినా మీరు చేస్తున్న పోరాటానికి నేను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. మరొకసారి ప్రభుత్వం పునరాలోచించి మాల దాసరి కులానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ మాల దాసరి సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.