రాష్ట్ర ప్రభుత్వానికి మందకృష్ణ కీలక విజ్ఞప్తి
హైదరాబాద్ ఫిబ్రవరి 19(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణపై శాస్త్రీయంగా ముందుకు వెళ్లని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన ఎస్సీ వర్గీకరణ నివేదికలో ఉన్న లోపాలను సవరించాలని కోరారు. ఎవరో ఒకరి ప్రయోజనాల కోసం డీ గ్రూప్ లేకుండా చేశారని అసహనం వ్యక్తం చేశారు. చిన్న చిన్న లోపాలతో అందరికీ న్యాయం జరుగదు. 59 కులాలకు ఎవరి వాటా వారికి దక్కాలని సూచించారు. వర్గీకరణ నివేదికను ప్రకటించే ముందు ప్రభుత్వం తగిన కసరత్తు చేయలేదు. ఆ నివేదికను సబ్ కమిటీ గానీ, కేబినెట్ గానీ అధ్యయనం చేయలేదు. ఆగమేఘాల మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని వెనుక ఓ మతలబు ఉన్నది. ఈ నెల 7న లక్ష డప్పులు, వేలగొంతుల కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. దీన్ని రద్దు చేయించడానికే ప్రభుత్వం హడావుడిగా ఎస్సీ వర్గీకరణను ప్రకటించింది’ అని తెలిపారు. ఎస్సీలోని అన్ని కులాలు, వాటి ఆర్థిక పరిస్థితులను సరిగా అధ్యయనం చేయకుండా, అంచనా వేయకుండానే ప్రభుత్వం ముందుకెళ్లిందని ఓ మీడియా సమావేశంలో మందకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.