సీఎం గారూ కాస్త టైం ఇవ్వండి… మాజీ ఎమ్మెల్యే వినతి
హైదరాబాద్ ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):సీఎం గారూ కాస్త మీ సమయం ఇవ్వండి.. ప్రజా సమస్యలపై మాట్లాడాలి అంటూ ఓ మాజీ సీనియర్ ఎమ్మెల్యే కోరడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఐదుసార్లు సీపీఐ (ఎంఎల్) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అతి సాధారణ సీనియర్ నాయకుడు గుమ్మడి నరసయ్య గురించి మన అందరికీ తెలిసిందే. అయితే తన సొంత జిల్లా ఖమ్మంలోని కొన్ని ప్రజా సమస్యలు, పోడు భూములు, సీతారామ ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాల గురించి పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి చర్చించేందుకు ప్రయత్నిస్తే అధికారులు ఆ అవకాశం ఇవ్వడం లేదని ఆయన వాపోయాడు. ఇప్పటి వరకు 4 సార్లు తాను సీఎంను కలవడానికి వచ్చానని.. ముందుగా ఫోన్ చేస్తే రమ్మని చెబుతారని, తీరా ఇక్కడికి వచ్చాక మాత్రం గేటు లోపలికి కూడా అడుగు పెట్టనివ్వడం లేదంటూ ఆవేదన చెందాడు. తాజాగా గురువారం మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చి, ఆయన ఇంటి ముందు ఎండలో నిలబడి గంటలు గంటలు ఎదురు చూశానని, అయినప్పటికీ ఆయనను కలిసే అవకాశం ఇవ్వలేదని అన్నాడు. కాగా గురువారం గుమ్మడి నరసయ్య సీఎం ఇంటిముందు ఎండలో నిలబడి ఎదురు చూస్తున్న ఫోటోలు సామాజిక మధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. కాగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆస్తులు ఏమీ కూడగట్టుకోని అతి సాధారణ నాయకుడు గుమ్మడి నరసయ్య. ఇప్పటికీ ఆయన సైకిల్ మీద లేదంటే సాధారణ పౌరుల మాదిరిగా బస్సులో ప్రయాణాలు చేస్తుంటారు. ఆయనకు వచ్చే కొద్ది మొత్త, పెన్షన్ కూడా పార్టీ కార్యక్రమాలకు డొనేట్ చేస్తుంటారు.