బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చేపలకు ఫుల్ గిరాకీ..
ముషీరాబాద్, ఫిబ్రవరి 23(ప్రజాక్షేత్రం):బర్డ్ ప్లూ నేపథ్యంలో చేపల అమ్మకాలకు గిరాకీ పెరిగింది. ముషీరాబాద్ చేపల మార్కెట్ ఆదివారం కోనుగోలుదారులతో కిటకిటలాడింది. నగర నలుమూలల నుంచి జనం చేపలు కొనుగోలు చేయడానికి రావడంతో చేపల మార్కెట్ రద్దీగా మారింది. మాములు రోజుల్లో 40 టన్నుల వరకు అమ్మకాలు సాగించే వ్యాపారులు ఆదివారం ఒక్క రోజు దాదాపు 60 టన్నుల చేపల విక్రయాలు జరిపినట్లు చెప్తున్నారు. బర్డ్ ప్లూ నేపథ్యంలో చేపల కొనుగోలుకు గిరాకి పెరగడంతో వ్యాపారులు రేట్లు పెంచారు. మామూలు రోజుల్లో రవ్వు కిలో రూ. 140 ఉండగా ప్రస్తుతం రూ. 160 నుండి రూ. 180కి పెంచారు. అదేవిధంగా బొచ్చ కిలో రూ. 120 ఉండగా నేడు రూ. 140, కొర్రమీను మామూలు రోజుల్లో రూ. 450 ఉండగా ఆదివారం రూ. 550, రొయ్యలు రూ. 300 ఉండగా ఇవాళ రూ. 350 పలికినట్లు చేపల వ్యాపారులు చెప్తున్నారు. బర్డ్ ప్లూ నేపథ్యంలో చేపల కొనుగోలుకు జనం ఆసక్తి చూపడంతో వ్యాపారులు ధరలు పెంచారు. చేపలు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున జనం రావడంతో మార్కెట్ పరిసరాలు రద్దీగా మారాయి. ముషీరాబాద్, సాగర్‌లాల్ ఆసుపత్రి, రాంనగర్, పార్శిగుట్ట మార్గాల వైపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.