రేపు కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల నిరసన
మహబూబ్ నగర్ ఫిబ్రవరి23(ప్రజాక్షేత్రం):రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలపనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు వాకిట అశోక్ కుమార్, ఎం.గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులు, పెన్షన్ స్కీం, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు, రక్షణ చట్టం, చిన్న, మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ గుర్తింపు లాంటి తదితర సమ్యసలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్, హెల్త్ కార్డులు ఇవ్వకుండా జీవో 239 సమీక్ష,సవరణ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నదని,దీని వల్ల జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చి, ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయినా ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని వారు విమర్శించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని వారు విజ్ఞప్తి చేశారు.