యూరియా కోసం రైతుల తిప్పలు..సహకార సంఘం ఎదుట బారులు..
జగిత్యాల ఫిబ్రవరి 24(ప్రజాక్షేత్రం):జగిత్యాల జిల్లాలో యూరియా నిల్వల కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు జిల్లా అధికారులు ఎలాంటి కొరత లేదని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సోమవారం జగిత్యాల పట్టణంలోని లింగంపేట రోడ్డులో గల సహకార సంఘం ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఎండ తీవ్రత కారణంగా లైన్ లో పాస్ పుస్తకాలు, రాళ్లు చెప్పులు మొదలైన వాటిని ఉంచి పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి యూరియా కోసం క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు యూరియా కొరత లేకుండా అవసరమైన మేర అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని కొన్ని మండలాల్లో రైతుల ఆధార్ కార్డులు తీసుకుని యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యూరియా కొరత, బ్లాక్ లో ఎక్కువ అమ్మడం పట్ల అధికారులు ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది.