ఈసారైనా ఇచ్చేనా.. మార్చి 1న కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఆ జిల్లాల్లోనే!
హైదరాబాద్ ఫిబ్రవరి 25(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై సస్పెన్స్ వీడింది. సంక్రాంతి, జనవరి 26 అంటూ రేషన్ కార్డుల పంపిణీని వాయిదా వేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 1న కొత్త కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులను అందించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నది. మిగిలిన జిల్లాల్లో మార్చి 8 తర్వాత అందించనుంది. ముందుగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లోని 1.12 లక్షల మందికి కొత్త రేషన్‌కార్డులు ఇస్తారని సమాచారం. రంగారెడ్డి జిల్లాలో 24 వేలు, వికారాబాద్ జిల్లాలో 22 వేలు, నాగర్‌కర్నూల్‌లో 15 వేలు, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 13 వేల చొప్పున, నారాయణపేట జిల్లాలో 12 వేలు, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి జిల్లాల్లో 6 వేల చొప్పున, హైదరాబాద్‌లో 285 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్‌కార్డులుండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కాంగ్రెస్ సర్కారు కొత్త కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన కొత్తగా 18-20 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే ఆస్కారమున్నది. అయితే ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్నది. దీనికి గడువు తేదీ అంటూ ఏమీ లేదు. మీసేవా కేంద్రాల్లో నిరంతరం కొనసాగనుంది. ఇందుకోసం రూ.50 ఫీజు తీసుకుంటారు. పని అయ్యాక.. స్టేటస్ చూసుకోవడానికి ఒక రిఫరల్ నంబర్ కూడా ఇస్తారు.