Praja Kshetram
తెలంగాణ

రాజేంద్రనగర్ లో చీటింగ్ కేసును ఛేదించిన పోలీసులు


రాజేంద్రనగర్ లో చీటింగ్ కేసును ఛేదించిన పోలీసులు

 

శంషాబాద్ మార్చి 07(ప్రజాక్షేత్రం): నకిలీ పత్రాలు సృష్టించి 600 గజాల ప్లాట్లును 4.26 కోట్లకు అమ్మి మోసం చేసిన కేసును రాజేంద్రనగర్ పోలీసులు ఛేదించారు. 15 మంది నిందితుల్లో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1.69 కోట్ల నగదు, 3 కార్లు, 7 సెల్ ఫోన్లు, 4 నకిలీ డాక్యుమెంట్లు, లిస్ట్ స్టాపులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు. రాజేంద్రనగర్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మశ్రీ హైదరాబాద్ సోమాజిగూడ కు చెందిన వినీత చౌదరి అనే మహిళకు 600 గజాల ప్లాట్ ఉంది. ఆమె ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉంటుందన్నారు. ఆమె ప్లాట్ ను కొందరు వ్యక్తులు ఫోర్జరీ చేసి అమ్మినట్లు ఆమెకు తెలియడంతో గత నెలలో రాజేంద్రనగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అందులో 15 మంది నిందితులు కలిసి చేసినట్లు గుర్తించామన్నారు. 15 మందిపై కేసు నమోదు చేసి అందులో నిందితులంతా బండ్లగూడ బోరబండకు చెందినవారే ఉన్నారు. ఈ 15 మంది నిందితులంతా 600 గజాల స్థలానికి నకిలీ పత్రం సృష్టించి ప్లాట్ యజమాని కెనడాలో ఉంటుందని, నకిలీ స్టాంపులు తయారు చేసి మూసాపేట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ 600 గజాలు ప్లాటును శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి లకు 4.26 కోట్ల రూపాయలకు విక్రయించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఏడు మంది నిందితుల్లో ఇమ్మానియేల్, దివాకర్ వర్మ, పాల్సన్ సుభాషిని, నాగేష్ అలియాస్ నాగేశ్వరరావు, పుష్ప కుమారి, చంద్రమోహన్, వల్లి, ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1.69 కోట్ల నగదు,3 కార్లు, ఏడు సెల్ ఫోన్లు, నాలుగు నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, నకిలీ స్టాంపులు,3 కిలోల నకిలీ బంగారు బిల్లలు స్వాధీనం చేసుకొని ఏడుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డిసిపి చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఈ నిందితులపై పీడియాక్టు కూడా ఓపెన్ చేస్తామన్నారు. పరారీలో ఉన్న మరో 8 మంది నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ నకిలీ పత్రాలు సృష్టించి పాట్ల రిజిస్ట్రేషన్ చేసిన కేసులో సబ్ రిజిస్టర్ తో పాటు ఆ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా పాత్ర ఉందా అనే కోణంలో కూడా విచారించడం జరుగుతుందని, ఒకవేళ అధికారుల పాత్ర కూడా ఉంటే కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతుంది అన్నారు. నకిలీ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వారిని నమ్మి ప్లాట్లు కొని మోసపోతున్నారు. ప్లాట్లు కొనాలనుకుంటే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పూర్తిగా విచారణ చేసుకున్న తర్వాత, వారి ఇంటికి వెళ్లి సరైన పత్రాలను చూసుకొని ప్లాట్లు కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ క్యాస్ట్ తదితరులు పాల్గొన్నారు.

Related posts