Praja Kshetram
తెలంగాణ

పోస్టల్‌ ఇన్సూరెన్స్‌ భళా.. బీమా ధీమాతోపాటు చక్కని ఆర్థిక ప్రయోజనాలు

పోస్టల్‌ ఇన్సూరెన్స్‌ భళా.. బీమా ధీమాతోపాటు చక్కని ఆర్థిక ప్రయోజనాలు

 

– గ్రాడ్యుయేట్లకూ పీఎల్‌ఐ అవకాశం

హైదరాబాద్ మార్చి 10(ప్రజాక్షేత్రం):జీవిత బీమా ఆకర్షణీయ రాబడులనూ అందిస్తే బాగుంటుంది కదూ. మనకు, మన కుటుంబ సభ్యులకు బీమా ధీమాతోపాటు చక్కని ఆర్థిక ప్రయోజనాలూ అందితే అంతకన్నా ఇంకేం కావాలి మరి. అయితే ఇలాంటి బెనిఫిట్స్‌, ఫీచర్లతోనే పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (పీఎల్‌ఐ) అందుబాటులో ఉన్నది. ఇదేదో నిన్నమొన్న పరిచయమైనది కాదు.. 141 ఏండ్ల చరిత్ర ఉన్నదీ బీమాకు. నిజానికి ఆరంభంలో తపాలా శాఖ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఓ సంక్షేమ పథకంగా మొదలైన పీఎల్‌ఐని.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు, భద్రతా సిబ్బందికి, సర్కారీ సంస్థల్లో కొలువులు చేస్తున్నవారికి వర్తింపజేశారు. కాలక్రమేణా వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏల వంటి ప్రొఫెషనల్స్‌తోపాటు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో నమోదైన కంపెనీల ఉద్యోగులకూ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల గ్రాడ్యుయేట్లకూ పీఎల్‌ఐ సౌకర్యాన్ని పొడిగించారు. ఇక ఈ బీమాలోని పథకాల విషయానికొస్తే..

*యాంటిసిపేటెడ్‌ ఎండోమెంట్‌ అస్యూరెన్స్‌ (సుమంగళ్‌)*

– ఇదో మనీబ్యాక్‌ పాలసీ

– 19-45 ఏండ్లవారు అర్హులు

– పాలసీ కాలపరిమితి 15-20 ఏండ్లు

– 15 ఏండ్ల పాలసీపై 6, 9, 12 ఏండ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్‌

– 20 ఏండ్ల పాలసీపై 8, 12, 16 ఏండ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్‌

– ఏటా ప్రతీ వెయ్యికి రూ.48 చొప్పున బోనస్‌ లభిస్తుంది.

*హోల్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ (సురక్ష)*

– 19-55 ఏండ్లవారు అర్హులు

– బీమా రూ.20వేలు-రూ.50 లక్షలు

– ప్రీమియంలు చెల్లించే వయసును 55, 58, 60 ఏండ్లుగా ఎంచుకోవచ్చు

– పాలసీ తీసుకున్న నాలుగేండ్ల తర్వాత రుణ సదుపాయం

– మూడేండ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్‌కు అవకాశం

– ఐదేండ్లలోపు సరెండర్‌ చేస్తే బోనస్‌ రాదు

– ఐదేండ్లు దాటిన పాలసీల సరెండర్‌పై బోనస్‌ల్లో కోత

– ఏటా ప్రతీ వెయ్యికి రూ.76 చొప్పున బోనస్‌ లభిస్తుంది

– పాలసీదారుకు 59 ఏండ్లదాకా ఈ స్కీమ్‌ను ఎండోమెంట్‌ అస్యూరెన్స్‌ పాలసీలోకి మార్చుకోవడానికి వీలుంటుంది

– పాలసీదారుకు 80 ఏండ్లు దాటితే లేదా పాలసీదారు చనిపోతే వారి వారసులకు బీమా సొమ్ము, దానిపై బోనస్‌ ప్రయోజనాన్ని చెల్లిస్తారు.

*కన్వర్టబుల్‌ హోల్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ (సువిధ)*

– 19-50 ఏండ్లవారు అర్హులు

– కనీస బీమా రూ.20వేలు, గరిష్ఠ బీమా రూ.50 లక్షలు

– పాలసీ తీసుకున్న నాలుగేండ్ల తర్వాత రుణ సదుపాయం

– మూడేండ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్‌కు అవకాశం

– ఐదేండ్లలోపు సరెండర్‌ చేస్తే బోనస్‌ రాదు

– ఐదేండ్లు దాటిన పాలసీల సరెండర్‌పై బోనస్‌ల్లో కోత

– ఏటా ప్రతీ వెయ్యికి రూ.76 చొప్పున బోనస్‌ లభిస్తుంది

– ఐదేండ్ల తర్వాత (ఆరేండ్లు దాటరాదు) ఎండోమెంట్‌ అస్యూరెన్స్‌ స్కీమ్‌లోకి మారవచ్చు. అప్పుడు బోనస్‌లూ అదే పద్ధతిలో లభిస్తాయి. అయితే కన్వర్షన్‌ లేకపోతే హోల్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌గా పరిగణిస్తారు.

*ఎండోమెంట్‌ అస్యూరెన్స్‌ (సంతోష్‌)*

– 19-55 ఏండ్లవారు అర్హులు

– కనీస బీమా రూ.20వేలు, గరిష్ఠ బీమా రూ.50 లక్షలు

– పాలసీ తీసుకున్న మూడేండ్ల తర్వాత రుణ సదుపాయం

– మూడేండ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్‌కు అవకాశం

– ఐదేండ్లలోపు సరెండర్‌ చేస్తే బోనస్‌ రాదు

– ఐదేండ్లు దాటిన పాలసీల సరెండర్‌పై బోనస్‌ల్లో కోత

– ఏటా ప్రతీ వెయ్యికి రూ.52 చొప్పున బోనస్‌ లభిస్తుంది.

*జాయింట్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ (యుగళ్‌ సురక్ష)*

– 21-45 ఏండ్ల దంపతులు అర్హులు

– కనీస బీమా రూ.20వేలు, గరిష్ఠ బీమా రూ.50 లక్షలు

– పాలసీ కాలపరిమితి 5-20 ఏండ్లు

– పాలసీ తీసుకున్న మూడేండ్ల తర్వాత రుణ సదుపాయం

– మూడేండ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్‌కు అవకాశం

– ఐదేండ్లలోపు సరెండర్‌ చేస్తే బోనస్‌ రాదు

– ఐదేండ్లు దాటిన పాలసీల సరెండర్‌పై బోనస్‌ల్లో కోత

– మరణానంతర ప్రయోజనాలు భాగస్వామికి అందుతాయి. లేదా వారి వారసులకు వెళ్తాయి

– ఏటా ప్రతీ వెయ్యికి రూ.52 చొప్పున బోనస్‌ లభిస్తుంది

– సింగిల్‌ ప్రీమియంతో భార్యాభర్తల బీమా కవరేజీని పొడిగించుకోవచ్చు

*చిల్డ్రెన్‌ పాలసీ (బాల్‌ జీవన్‌ బీమా)*

– పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు.

– గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకొనే వెసులుబాటును కల్పించారు.

– పిల్లల వయసు తప్పనిసరిగా 5 నుంచి 20 ఏండ్ల మధ్య ఉండాలి.

– పిల్లలకు గరిష్ఠంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు బీమా (సమ్‌ అస్యూర్డ్‌) ప్రకారం (ఏది తక్కువైతే అది) ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు

– పాలసీదారు (పిల్లల తండ్రి) వయసు 45 ఏండ్లు దాటరాదు

– పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియంలు చెల్లించనక్కర్లేదు. కాలపరిమితి తీరాక బీమా సొమ్ము, బోనస్‌లు వస్తాయి

– రుణ సదుపాయం, సరెండర్‌ సౌకర్యం ఉండవు. ప్రీమియంలు తల్లిదండ్రులే చెల్లించాలి

– పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అయినప్పటికీ వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు

– ఎండోమెంట్‌ పాలసీ ప్రకారం బోనస్‌లు వర్తిస్తాయి

– పాలసీదారులు గుర్తుంచుకోండి*

ఎంత చిన్న వయసులో బీమా తీసుకుంటే అంత తక్కువగా ప్రీమియంలు, ఎక్కువగా ప్రయోజనాలుంటాయన్నది మరువద్దు. ఇక పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలనుకొనేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్లు తమ పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాలసీనిబట్టి వివిధ వైద్య పరీక్షలూ ఉంటాయి. గ్రామీణ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కూడా ఉన్నది. దీనికి గ్రామీణులు అర్హులు. అందులోనూ ఇలాగే రకరకాల స్కీములుంటాయి. ఆయా నిబంధనలూ వర్తిస్తాయి. మరిన్ని వివరాల కోసం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు పోస్ట్‌ఇన్ఫో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్టాఫీస్‌ను సంప్రదించవచ్చు. అలాగే https://www.indiapost. gov.inను లాగిన్‌ కావచ్చు.

Related posts