చస్తే చావు… నీ ఇష్టం..!?
– ధరణీ లో తలెత్తిన భూ సమస్య
– పరిష్కారం కోసం వెళ్లిన యువకుడిపై పేపర్ లు విసిరిన అధికారి
– చస్తే చావు నీ ఇష్టం అంటూ ఓ అధికారి నిర్లక్ష్య మాటలకు
మెదక్ మార్చి 10(ప్రజాక్షేత్రం): ధరణీ లో తలెత్తిన భూ సమస్య పరిష్కారం కోసం వెళ్లిన యువకుడిపై పేపర్ లు విసిరి చస్తే చావు నీ ఇష్టం అంటూ ఓ అధికారి నిర్లక్ష్య మాటలకు నిరసనగా మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం కు ప్రయత్నించిన ఘటన సోమవారం మెదక్ కలెక్టరేట్ లో జరిగింది. బాధితుడి కథనం మేరకు మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం శమ్నాపూర్ కు చెందిన పట్నం సురేందర్ తండ్రి పేరిట 18 గంటల భూమి ఉంది. ధరణి పోర్టల్ లో సురేందర్ ఆధార్ తండ్రి రమేష్ పేరిట లింక్ అయింది. దీంతో సురేందర్ భూమి మార్పిడి చేసిన అది తండ్రి రమేష్ పేరిట ఉంటుంది. ఇటీవల సురేందర్ కొనుగోలు చేసిన భూమి కూడా తండ్రి ధరణీ లో చూపిస్తుంది. దీని వల్ల రైతుబంధు, పీఎం కిసాన్ యోజన తో పాటు వన్ బీ లో కూడా చూపడం లేదు. దీంతో హవేలీ ఘనపూర్ తహశీల్దార్ కార్యాలయం తో పాటు జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేస్తూ వస్తున్నాడు. రెవెన్యూ అధికారులు నాన్చుడు ధోరణి తప్పా భూ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. సురేందర్ అధికారుల చుట్టూ తిరిగినా స్పందన మాత్రం రావడం లేదు. అధికారులు మరుతున్నారే తప్పా ఏళ్లుగా సమస్య అలాగే ఉంటుంది. కొత్తగా వచ్చిన అధికారులు మాత్రం ఇన్నాళ్లు గాడిదలు కాశావా అనే మాటలు అవమానకరంగా భావించాడు. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి వద్దకు వెళితే పేపర్ లు ముఖం పై కొట్టి చస్తే చావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అవమానంగా భావించిన యువకుడు మెదక్ కలెక్టరేట్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి సిద్ధమయ్యాడు. తమ భూ సమస్య పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం తో పాటు వారి తీరు తో తాను కలెక్టరేట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అక్కడే ఉన్న పలువురు బాధితుడికి నచ్చజెప్పి అదనపు కలెక్టర్ నగేష్ కు వద్దకు తీసుకు వెళ్ళారు. తాను సిసి ఎల్ కు వెళ్లి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డి ఆర్ వో ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.