Praja Kshetram
తెలంగాణ

అనంతగిరికి వెళితే వీటిని అసలు మిస్ కావొద్దు! 

అనంతగిరికి వెళితే వీటిని అసలు మిస్ కావొద్దు!

– అనంతగిరిలో రూ. 1000 కోట్లతో పర్యాటక అభివృద్ధిపనులు.

– వికారాబాద్‌కు సమీపంలో 3750 ఎకరాల్లో విస్తరించిన అనంతగిరి హిల్స్.

– రాత్రి వేళ క్యాంప్‌ఫైర్‌ సైతం.

వికారాబాద్ మార్చి 11(ప్రజాక్షేత్రం):పర్యాటక అభివృద్ధితో సందర్శకులను ఆకట్టుకునే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 2025-30 కొత్త విధానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. పలు సర్క్యూట్లను గుర్తించి ఆయా ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ జాబితాలో వికారాబాద్‌ జిల్లా అనంతగిరికి సైతం చోటు దక్కించుకుంది. ఇక్కడ పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కేవలం నెల రోజుల్లోనే వాటిని అందుబాటులోకి తేనుండటం విశేషం.

– మూడువేల ఎకరాల పై చిలుకు

ఆధ్యాత్మిక, ప్రకృతి, చారిత్రక, వారసత్వ కట్టడాలు, పురావస్తు సంపదకు నెలవైన అనంతగిరి అటవీ ప్రాంతాన్ని వారాంతపు సెలవు రోజుల్లో వేలాది మంది సందర్శిస్తారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతం వికారాబాద్‌కు సమీపంలో 3750 ఎకరాల్లో విస్తరించి ఉంది. టూరిస్టుల మదిని దోచేలా వివిధ ఆకృతుల్లో ఉద్యానాలు, ఆట స్థలాలు అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ఎత్తయిన కొండలు, దట్టమైన చెట్ల మధ్య పద్మనాభ స్వామి ఆలయం కొలువై ఉంది. ఇక్కడి అరుదైన ఔషధ మొక్కలను సంరక్షిస్తూనే మరోవైపు మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు.

– అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో

ప్రభుత్వం తొలి విడతలో రూ.వెయ్యి కోట్లు కేటాయించగా, వివిధ పనులు చేపట్టారు. ప్రస్తుతం అటవీ అభివృద్ధి సంస్థ (ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో నాలుగు పాత గుడారాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అడవిలో పక్షుల కిలకిలారావాల మధ్య 3 కిలో మీటర్ల దూరం వరకు నడక సాగించేలా, 3 నుంచి 4 కిలో మీటర్ల వరకు ట్రెక్కింగ్‌ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నారు.

– క్యాంప్ఫైర్ అందుబాటులోకి

సాయంత్రం వేళ 5 నుంచి 10 కిలో మీటర్లు సాగే సఫారీలో చుక్కల దుప్పులు, కృష్ణ జింకలు, అడవి పందులు, పునుగుపిల్లి, నెమళ్లను నేరుగా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వేళ వెచ్చదనానికి క్యాంప్‌ఫైర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుసటి రోజు ఉదయం 11 వరకు రాత్రి వసతి, భోజనం, సఫారీ కలిపి ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున వసూలు చేయాలని ఎఫ్‌డీసీ భావిస్తోంది.

Related posts