పోలీసుల విచారణలో రిమాండ్ ఖైదీ మృతి.. స్పందించిన నిజామాబాద్ ఏసీపీ
నిజామాబాద్ మార్చి 14(ప్రజాక్షేత్రం): పోలీస్ కస్టడీలో ఉన్న రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా లో తీవ్ర కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన యువకుడి మృతి ఘటనపై మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు పెట్టిన టార్చర్ వల్ల తమ కుమారుడు పోలీస్ స్టేషన్ లోనే మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. సంపత్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటన సమాచారం అందుకున్న నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి.. హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకుని డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపత్ ఆసుపత్రిలోనే కుప్పకూలి చనిపోయాడు. ఇది వైద్యులు కూడా చూశారని చెప్పుకొచ్చారు. అలాగే రిమాండ్ ఖైదీగా ఉన్న సంపత్ మృతి పై ఎంక్వయిరీ జరుగుతోందని, ముగ్గురు వైద్యుల బృందం సంపత్ మృతదేహానికి పోస్టుమార్టం చేస్తారని తెలిపారు. అలాగే అనుమానస్పద మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ సందర్భంగా ఏసీపీ చెప్పుకొచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ కన్సల్టెన్సీ ని నిర్వహిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ ఉపాధి కోసం కొంతమందిని గల్ఫ్ దేశం పంపించినట్లు సమాచారం. సంపత్ ద్వారా దుబాయికి వెళ్లిన కొందరికి పని లేక ఇబ్బందులు పడ్డారు. తమను సంపత్ కావాలనే నకిలీ వీసాలపై పంపించి మోసం చేశాడని కొంతమంది బాధితులు నిజామాబాద్ జిల్లాలోని సైబర్ క్రైం పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో నిజామాబాద్ సైబర్ క్రైం పోలీసులు సంపత్‌తో పాటు ఇంకొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అనంతరం రెండు రోజుల విచారణ నిమిత్తం సంపత్ ను కస్టడీలోకి తీసుకొగా.. ఈ రోజు ఉదయం సంపత్ కస్టడీలో మృతి చెందడం సంచలనంగా మారింది.