తలాపున పారుతుంది గోదారి నీ సేను నీ సేలక ఎడారి..!
– అడుగంటుతున్న భూగర్భ జలాలు.
– ఆందోళన చెందుతున్న రైతులు.
-పెట్టుబడి నష్టపోయామని ఆవేదన.
పెద్దపల్లి బ్యూరో, మార్చి 17(ప్రజాక్షేత్రం):రోజురోజుకూ భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో ఒక వైపు బోర్లు ఎత్తిపోతుండగా మరో వైపు బావుల్లో నీరు అడుగంటి పోతున్నాయి. దీంతో సాగు కష్టాల్లో, ఆర్థిక నష్టాల్లో రైతులు కూరుకుపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పెద్దపల్లి జిల్లాపై కుండగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చుక్కనీరు లేకపోవడంతో బోర్లు, బావులు అడుగంటుతున్నాయి. దీంతో రైతులు తిరిగి బోర్లు వేసుకోవడం, బావులను పూడిక తీయడం లాంటి పనులను చేపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. తలాపున పారుతున్న గోదావరి నీ సేను నీ సెలుక ఎడారి అని స్థానిక కవి రచయిత మల్లావజ్ఝల సదాశివుడు మూడు దశాబ్దాల క్రితం తెలంగాణ సాగు నీటి కష్టాలను ఏకరువు పెట్టగా పదేళ్ల తర్వాత తిరిగి అదే పరిస్థితులు నెలకొనడంతో కాంగ్రెస్ పాలన వచ్చింది కష్టాలను వెంట బెట్టుకొని వచ్చిందనే విధంగా పాలన సాగుతుండటంతో రైతుల్లో అసహనం వ్యక్తం అవుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం మండలాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. 2023 ఫిబ్రవరి నెలలో భూగర్భజలాలు 5.47 మీటర్ల లోతులో ఉండగా 2024 ఫిబ్రవరి మాసంలో 5.09 మీటర్ల లోతులో,2025 ఫిబ్రవరి మాసంలో 5.44మీటర్ల లోతులోకి పడిపోయాయి. బీఆర్ఎస్ పార్టీపై కక్షతో కాళేశ్వరంను పక్కన పెట్టి తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా ముంచుతున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో మోటార్లతో పని లేకుండానే కాలువల్లో సాగు నీరు పారిందని, కాళేశ్వరం గేట్లు ఎత్తడంతో బోర్లన్నీ ఎత్తిపోయి బోర్లల్లో కూడా చుక్క నీరు రావడం లేదని మూడేళ్ల దాకా ఇక సాగు అంతేనా..? అలాగైతే తాము ఎలా బ్రతుకుతామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి నష్టపోయమని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.