Praja Kshetram
పాలిటిక్స్

కేటీఆర్, హరీష్ రావులతో.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ!

కేటీఆర్, హరీష్ రావులతో.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ!

 

హైదరాబాద్ మార్చి 17(ప్రజాక్షేత్రం):బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, మాజీ మంత్రి టి.హరీష్ రావులను కలిశారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్, హరీష్ రావులను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము… సి చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని తీన్మార్ మల్లన్న కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లు ఉన్నారు. అనంతరం బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధీన్ ను కూడా తీన్మార్ మల్లన్న కలిసి వినతి పత్రాలు అందించడం గమనార్హం.

– చర్చనీయాంశమైన మల్లన్న వ్యవహారం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబంపైన, ఆయన పాలన విధానాలపైన నిత్యం తన యూ ట్యూబ్ చానల్ ద్వారా తీవ్ర విమర్శలు గుప్పించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం అంశమైంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపైన, కేసీఆర్ కుటుంబంపైన మల్లన్న చేసిన విమర్శలు రాజకీయంగా అప్పట్లో ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించాయి. దీంతో మల్లన్నను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేయడం..జైలుకు పంపించడం జరిగింది. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చాకా మల్లన్న కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మరింతగా విమర్శలు దాడి కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కు మద్ధతుగా నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా ఆ పార్టీ మద్ధతుతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన తప్పుల తడక అని తీవ్ర విమర్శలు చేశాడు. బీసీ నినాదం ఎత్తుకుని..బీసీలకు రాజ్యాధికారం కావాలన్న డిమాండ్ తో కార్యాచరణ చేపట్టారు. కాంగ్రెస్ రెడ్ల పార్టీ అంటూ.. రెడ్డి సామాజిక వర్గంపై విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా చర్యల కింద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ నుంచి బహిష్కరించింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిపైన, సీనియర్ కాంగ్రెస్ నేత కే.జానారెడ్డిపైన, కులగణనపైన మల్లన్న తన విమర్శల దాడిని మరింత పెంచారు. ఈ పరిణామాల క్రమంలో మల్లన్న బీసీ రిజర్వేషన్ బిల్లు అంశం పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుల తో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Related posts