Praja Kshetram
తెలంగాణ

వచ్చి రాని వైద్యానికి.. గిరిజనుడి బలి.

వచ్చి రాని వైద్యానికి.. గిరిజనుడి బలి.

 

– హుటాహుటిన శవం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు‌.

– బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ “హైడ్రామా”..!

– హాస్పిటల్ ముందు ఆందోళన ఉద్రిక్తత.

– అన్ క్వాలిఫైడ్ వైద్యుడు “వెంకటేష్” వైద్య లీల.

– మల్టీస్పెషాల్టి హాస్పిటల్ కు భారీ పోలీసు బందోబస్తు.

– పోలీసుల అదుపులో ఇద్దరు డాక్టర్లు.

– వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు.

– హాస్పిటల్ యాజమాన్యంపై మృతుడి కుమారుడి ఫిర్యాదు.

– కేసు నమోదు చేసుకున్న పోలీసులు

– గిరిజనుడి ప్రాణం ఖరీదు రూ. 6 లక్షలకు సెటిల్ మెంట్..!?

షాద్ నగర్ మార్చి 17(ప్రజాక్షేత్రం):గ్రామీణ నిరుపేదల ప్రాణాలంటే లెక్కలేదు.. ఖరీదైన వైద్యం పేరుతో ప్రాణాలు కాపాడుతామని అందమైన ఆకర్షణీయమైన బోర్డులు పెట్టి చివరకు వచ్చిరాని వైద్యంతో అమాయకుల ప్రాణాలు తీసేందుకు కారణమవుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం వచ్చి చివరకు శవమైపోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని హుటాహుటిన ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. చివరకు బంధువులు సామాజిక నాయకులు రంగం ప్రవేశం చేసి ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీయడంతో అసలు కథ వెలుగు చూసింది..

– ఏం జరిగిందంటే..?

షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కోనాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లచ్చిరాం తండాకు చెందిన వి. సామ్య నాయక్ అనే గిరిజన వ్యక్తి జ్వరంతో బాధపడుతూ స్థానిక ధన్వంతరి వైద్యుడు వెంకటేష్ వద్దకు వచ్చాడు. అయితే మెరుగైన ట్రీట్మెంట్ కోసం తను స్థాపించిన మరో బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈనెల 14న చేర్చాడు. (ఈ హాస్పటల్ కూడా మేనేజ్మెంట్ ఇతనిదే) అయితే కొన్ని రోజులుగా అతనికి ఆసుపత్రిలో ఉంచి ఇతర డాక్టర్లతో చికిత్స చేస్తున్నారు. సామ్యా నాయక్ కు ఆరోగ్యం క్షీణించింది ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని అతనికి డెంగ్యూ ఉందని నిర్ధారించారు. నిన్న ఆకస్మికంగా సామ్యా నాయక్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆందోళన మొదలైంది. ఆసుపత్రిలో రాత్రి సామ్యా నాయక్ మృతి చెందడంతో, చెప్పా పెట్టకుండా సామ్యా నాయక్ శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి చాకచక్యంగా తరలించి చేతులు దులుపుకున్నారు ఆసుపత్రి యాజమాన్యం. అయితే గిరిజనులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. దీంతో భారీ ఎత్తున పోలీసులను ఏర్పాటు చేసి బందోబస్తు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వచ్చేదాని వైద్యంతో తన తండ్రి ప్రాణం తీశారని ఆసుపత్రి యాజమాన్యం చికిత్సపై తమకు అనుమానాలు కూడా ఉన్నాయని మృతుడి కుమారుడు రమేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

– పోలీసుల అదుపులో వైద్యులు, తదితరులు.

షాద్ నగర్ పోలీసుల అదుపులో బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ఉన్నారు. పెద్ద ఎత్తున గిరిజన నాయకులు సామ్యా నాయక్ బంధువులు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. దీంతో అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్దీతత వాతావరణం నెలకొనడంతో కడ్తాల సీఐ శివప్రసాద్, కొందుర్గు ఎస్సై రవీందర్ నాయక్ తదితర పోలీసు సిబ్బంది గిరిజన నాయకులను ప్రజలను స్టేషన్ నుండి బయటికి పంపించారు. న్యాయం చేయాలని గిరిజనులు పట్టుబట్టారు. దీంతో స్థానిక గిరిజన నాయకులు కొందరు పోలీస్ స్టేషన్ చేరుకుని బాధిత కుటుంబ సభ్యులు గ్రామ నాయకులు తండా వాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించిన ఒక మహిళా డాక్టర్ మరో డాక్టర్ ను పోలీస్ స్టేషన్లో ఉంచారు. అదేవిధంగా ఈ ఆసుపత్రి కి సంబంధించి మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న ధన్వంతరి వైద్యుడు వెంకటేష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ ను పోలీసు అధికారి ప్రశ్నించి అతని విద్యార్హత గురించి తెలుసుకొని చివాట్లు పెట్టారు.

– ఆరు లక్షలకు సెటిల్మెంట్..?

సామ్యా నాయక్ ఆకస్మిక మృతి వ్యవహారంతో ఉద్దేక్తత వాతావరణం నెలకొన్న సందర్భంగా గిరిజనులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆమంచన్య సంఘటనలు జరగకుండా ఎస్సై సుశీల, శరత్ అక్కడ బందోబస్తు నిర్వహించారు. ఆస్పత్రి ముందు సామాజిక నాయకుడు యువసత్తా లక్ష్మణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం చేయడం చేతకాకపోతే ఊరుకోవాలని అమాయకుల ప్రాణాలను హరించడం అన్యాయమని మీడియా ముందు వాపోయారు. వచ్చిరాని వైద్యం చేస్తూ పట్టణంలో ప్రైవేట్ ప్రాక్టీషనర్ గా పనిచేస్తున్న వెంకటేష్ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేసి కొంతమంది వైద్యులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా వైద్యం చేయించడం జరుగుతుందని తెలిపారు. పేషంట్ల ప్రాణాలపైకి వచ్చేవరకు ఏం చేస్తున్నారని, ఒకవేళ చనిపోతే అంతా హరిబరిగా శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం ఎందుకని ప్రశ్నించారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా గిరిజన నాయకులు పెద్దలు సమక్షంలో నిర్వహించిన పంచాయతీలు సామ్య కుటుంబానికి 6 లక్షల రూపాయలు ప్రాణం ఖరీదు కట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదేవిధంగా మరికొంతమందికి ఒక లక్ష రూపాయలు ఖర్చులకోసం (ఎవరైనా చస్తే గద్దల్లా వాలే వాళ్ళు) ఇచ్చారని చెబుతున్నారు. మొత్తానికి గిరిజనుడి ప్రాణం ఖరీదు ఆరు లక్షలకు సెటిల్మెంట్ చేయడం గమనార్హం.

– కేసు నమోదు..

షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై కేసు నమోదు అయింది. మృతుడి కుమారుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శరత్ తెలిపారు. ఆసుపత్రి నిర్వాహకులపై అనుమానాలు ఉన్నాయని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శరత్ తెలిపారు.

– గతంలో కూడా ఇలాగే..

ప్రైవేట్ ప్రాక్టీషనర్ గా పట్టణంలో వైద్యం అందిస్తున్న వెంకటేష్ ఇటీవల బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుచేసి కొంత మంది వైద్యులను నియమించి తన వద్దకు వచ్చే వారిని ఈ ఆసుపత్రికి తరలిస్తూన్నట్టు అతని బాధితులు పేర్కొంటున్నారు. గతంలో కూడా ఇతనిపై ఆరోపణలు వచ్చిరయని వైద్యంతో వెంకటేష్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. సంఘంలో కొంతమంది పెద్దల పలుకుబడితో తన వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చేసుకుంటున్న వెంకటేష్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. కేశంపేట రోడ్డులో ఆర్.ఎం.పి వైద్యుడిగా చలామణి అవుతున్న వెంకటేష్ మెడలో స్టెతస్కోప్ వేసుకొని బహిరంగంగా వైద్యం చేస్తున్నాడు, ప్రాథమిక వైద్యం కాకుండా అన్ని రకాల ఇంజక్షన్లు మందులు సెలైన్లు ఇస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. వైద్యశాఖ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వెంకటేష్ పై గతంలో అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ అతని ఏదో విధంగా మేనేజ్మెంట్ చేసుకున్నట్లు కొందరు వైద్యులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఇతని వైద్య లీలలపై దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Related posts