Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఎపి కేబినెట్ ఆమోదం

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఎపి కేబినెట్ ఆమోదం

 

అమరావతి మార్చి 18(ప్రజాక్షేత్రం):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన(సోమవారం) రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మంత్రులతో మాట్లాడిన అనంతరం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా యూనిట్‌గా చేయాలని కొంతమంది మంత్రులు కోరారు. అలా చేస్తే న్యాయ పరమైన చిక్కులు వస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నివేదికను యధాతధంగా ఆమోదిద్ధామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

– బేడ బుడగ జంగాలపై కీలక నిర్ణయం..

గ్రూప్ 1 కేటగిరిలో రెల్లి ఉపకులాలకు ఒక శాతం, గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్ 3 మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్‌గా అమలు జరపాలని నిర్ణయించారు. రోస్టర్ పాయింట్లను 200గా ప్రభుత్వం నిర్ణయించింది. బేడ బుడగ జంగాలను రెల్లి ఉప కులాల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీన జాతీయ ఎస్సీ కమిషన్‌కు తీర్మానాన్ని పంపించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 2026 సెన్సెస్ రాగానే జిల్లాల వారీగా అమలు జరిపే అంశాన్ని పరిశీలిద్దామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నెల అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. అదే రోజు తీర్మానాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్‌కు పంపాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

Related posts