ఫిరాయింపు ఎమ్మెల్యేల పిల్లి మొగ్గలు!
హైదరాబాద్ మార్చి 19(ప్రజాక్షేత్రం):తెలంగాణలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సింబల్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ జనవరి 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఈనెల 25వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కౌంటర్ అఫిడవిట్స్ దాఖలు చేయడం అనివార్యంగా మారింది. అయితే ఇక్కడే బిగ్ ట్విస్టు నెలకొంది. ఎమ్మెల్యేలు అనర్హత వేటును తప్పించుకునేందుకు తమ అఫిడవిట్ లలో తాము పార్టీ మారలేదని.. సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశామని పేర్కొన్నట్లుగా సమాచారం. మీడియా తమ భేటీని వక్రీకరించి మేము పార్టీ మారినట్టుగా చూపించిందని అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ రకమైన వాదనతో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ సింబల్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్యలపై కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లను ఒకే దగ్గర కలిపి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 25న కొనసాగనుంది. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ సమయంపై జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి. ‘తగినంత సమయం అంటే ఎంత? వాయిదా వేస్తూ ఐదేండ్ల పదవి పూర్తయ్యే వరకు ఉంటారా? తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా? మనం ప్రజా స్వామ్యంలో ఉన్నాం. చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్ధం ఏం ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదు’ అని కీలక కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న జరిగే విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.