గుంతలతో ఆధ్వానంగా తయారైన రావులపల్లి వెళ్లే ప్రధాన రహదారి
– గ్రామీణ ప్రాంత రహదారుల నిర్మాణానికి దక్కని మోక్షం.
– ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఇదే దుస్థితి.
శంకర్ పల్లి, మార్చి 24(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ కు కూత వేటు దూరంలో రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధిలో రావుల పల్లి గ్రామంలో రోడ్లపరిస్థితి పూర్తిస్థాయి ఆధ్వాన్నంగా మారింది. ఏళ్ల తరబడి కొత్తరోడ్ల నిర్మాణాలు చేపట్టకపోతుండడం, అలాగే ఆధ్వానస్థితికి చేరుకున్న రోడ్లకు మరమతులు చేపట్టకపోవడం జనానికి శాపంగా మారుతోంది. వర్షాలకారణంగా చెడిపోతున్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమత్తులు చేపట్టకపోగా అలాగే అవసరమైన చోట్ల కొత్తరోడ్ల నిర్మాణాలు జరపకపోతున్న కారణంగా రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన రోడ్డు మార్గాలు పెద్ద పెద్ద గుంతలతో అధ్వానంగా తయారయ్యాయి. ఈ రోడ్లపై వాహనాలు నడపడం అంటే డ్రైవర్‌లకు కత్తిమీద సాములా మారుతోందంటున్నారు వాహనదారు. ఆటో రిక్షాలు, బైక్‌లు, కార్లపై ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటేనే జనం జడుసుకుంటున్నారు. ఈ రోడ్డుపై మూడు, నాలుగుసార్లు బైక్‌పై ప్రయాణిస్తే వెన్నునొప్పి తప్పదంటున్నారు. అయితే సంబంధిత ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ప్రతీఏటా ఈ రోడ్ల నిర్మాణాలు మరమతులకు హామీలు ఇస్తున్నప్పటికీ ఆ హామీలు ఆచరణకు రూపం దాల్చకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. గ్రామాలకు ఇప్పటి వరకు కూడా రోడ్డుసౌకర్యం సక్రమంగా లేవన్న ఆరోపణలున్నాయి. ఈ ఆధ్వాన్నరోడ్లపై ప్రయాణించాలంటే సర్కస్ ఫీట్లను తలపించాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పెద్దమొత్తంలో నిధులు విడుదల చేస్తున్నామని ఇస్తున్న హామీలు నీటిమూటలవుతున్నాయంటున్నారు. గత పదేళ్ల నుంచి రోడ్డు భారీ గుంతలతో గందరగోళంగా మారిపోయిందంటున్నారు. ఫత్తేపూర్ అల్ట్రాటెక్ కంపెనీ నుంచి రావులపల్లి వరకు వెళ్లే జనం సర్కస్ ఫీట్లను మరిపించే విధంగా వెళ్లాల్సి వస్తోంది.
– రోడ్డు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలి.
పత్తేపూర్ అల్ట్రాటెక్ కంపెనీ నుండి రావులపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఎమ్మెల్యే యాదయ్య గత సంవత్సరంలో ఎలక్షన్లో హామీ ఇచ్చి ఇప్పటివరకు అదేవిధంగా ఉందని కానీ ఇప్పటి వరకు చేపట్టలేదు. గుంతల రోడ్డుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని వేడుకుంటున్నారు.
మహ్మద్ నవాజ్ బీఆర్‌ఎస పార్టీ నాయకులు