Praja Kshetram
తెలంగాణ

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

 

– 2021లో నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదన్న ముఖ్యమంత్రి

– బెట్టింగ్ యాప్‌ల ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్న రేవంత్ రెడ్డి

– బెట్టింగ్ యాప్‌లపై విచారణ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి

హైదరాబాద్ మార్చి 26(ప్రజాక్షేత్రం):గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై మాజీ మంత్రి హరీశ్ రావు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం 2021లో ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆన్‌లైన్ రమ్మీ వంటి ఇతర గేమ్‌ల నిరోధానికి, నిషేధానికి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొన్ని రోజులుగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారించామని, దీని వలన సమస్య పరిష్కారం కాదని అన్నారు. ఈ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే చాలామందిని విచారణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు ప్రభుత్వానికి అన్ని అధికారాలు కావాలని, ఈ బెట్టింగ్ యాప్‌లపై విచారణ జరిపేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న వారికి విధించే శిక్షను పెంచేందుకు వచ్చే సమావేశాల్లో సవరణ బిల్లును సభలో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి అన్నారు.

Related posts