మల్లన్నపై చైర్మెన్ సీరియస్
తెలంగాణ బ్యూరో మార్చి 27(ప్రజాక్షేత్రం):ప్రయివేటు స్కూళ్ల ఫీజుల విషయంలో బుధవారం శాసనమండలిలో జరిగిన చర్చకు బీజేపీ సభ్యులు ఏవీఎన్.రెడ్డి గురువారం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎఫ్ఆర్సీ నిర్ణయించినట్టయితే దానికి విరుద్ధంగా ఉంటే తప్పని, అలాంటిదేమిలేదని చెప్పారు. సభలో సాటి సభ్యునిపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. దీనికి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యంచేసుకుని ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించామని చెప్పారు. వెంటనే తీన్మార్ మల్లన్న జోక్యం చేసుకుని‘ చైర్మెన్ సార్..ఆ మాటలను రికార్డుల్లో ఉంచండి’ అని అన్నారు. దీంతో రవీందర్ రావు జోక్యం చేసుకుని ‘ఎవరిని బెదిరిస్తున్నావు. అడ్డగోలు ఫీజులు ఎక్కడున్నవో చూపిస్తావా’ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు బీఆర్ఎస్ సభ్యులు కూడా తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ గొడవను సద్దుమణిచేసేందుకు చైర్మెన్ మరోసారి జోక్యం చేసుకుని ‘సభలో మరో సభ్యుని గురించి మల్లన్న మాట్లాడం సాంప్రదాయాలకు విరుద్ధం. సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తోంది’ అంటూ హెచ్చరించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
