కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో మీడియాకు నో ఎంట్రీ
కంగ్టి మార్చి 27(ప్రజాక్షేత్రం):కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో “పత్రికా ప్రతినిధులు ముందుగా అనుమతి లేకుండా కార్యాలయంలోకి అనుమతించబడరు” అనే స్టికర్‌ను ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై స్పష్టత కోరేందుకు వెళ్లిన విలేకరులకు ఊహించని అనుభవం ఎదురైంది. స్థానిక పాత్రికేయులు ఈ నిర్ణయంపై తహసీల్దార్ నజీమ్ ఖాన్‌ను వివరణ కోరేందుకు వెళ్లగా, ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అంతేకాకుండా, కంగ్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పాత్రికేయులను స్టేషన్‌కు రప్పించాలని పోలీసులకు ఆదేశించినట్లు సమాచారం.
-పాత్రికేయుల ఆగ్రహం
ఈ నిర్ణయాన్ని స్థానిక మీడియా ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. “ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత తప్పనిసరి. ప్రజలకు సమాచారం అందించడమే మా బాధ్యత. కానీ, మీడియాను అడ్డుకోవడం, స్టేషన్‌కు పిలిపించడం ప్రెస్ ఫ్రీడమ్‌పై దాడి చేసినట్లే” అని ఓ విలేకరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
-ఆర్డీవో అశోక్ చక్రవర్తి వివరణ
కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ స్టిక్కర్లు అతికించడం పూర్తిగా తహసీల్దార్ అబ్దుల్ నజీబ్ ఖాన్ స్వతంత్ర నిర్ణయం. ఇలాంటి నిబంధనలకు భారత రాజ్యాంగంలో ఎలాంటి మద్దతు లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత ఉండాలి, ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండాలి. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.