Praja Kshetram
తెలంగాణ

ఖైర‌తాబాద్‌ ఉప ఎన్నిక?.. టికెట్ కోసం ర‌చ్చ‌ రచ్చ!

ఖైర‌తాబాద్‌ ఉప ఎన్నిక?.. టికెట్ కోసం ర‌చ్చ‌ రచ్చ!

 

 

హైదరాబాద్ మార్చి 27(ప్రజాక్షేత్రం):బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోర్టులో వాదనలు ముగిసి తీర్పు వచ్చేదెప్పుడో… కోర్టు..స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారో లేదో ప్రస్తుతానికి అయోమయమే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వివాదం కొలిక్క రాకముందే ఉప ఎన్నికల ఊహాగానాలు మాత్రం రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని.. ఉప ఎన్నికలు తధ్యమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డాంభికంగా చెబుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఏకంగా అసెంబ్లీ వేదికగానే ఉప ఎన్నికలు రావని కుండ బద్ధలు కొట్టారు. 2013నుంచి 2023వరకు పార్టీ మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకొస్తాయని ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడున్న రాజ్యంగం..చట్టాలు, కోర్టులు అప్పుడు ఉన్నాయని..అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకొస్తాయంటూ లాజిక్ పాయింట్ వినిపించారు. అధికార ప్రతిపక్షాల వాదనలు ఎలా ఉన్న అంతిమ తీర్పు మాత్రం సుప్రీం కోర్టు.. అసెంబ్లీ స్పీకర్ లపైన అధారపడి ఉంది. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఓ ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే టికెట్ మా నాయకుడికే ఇవ్వాలంటూ ఓ కాంగ్రెస్ నేత అనుచరులు పెట్టిన ఫ్లెక్సీ నియోజకవర్గ రాజకీయాల్లో కాక రేపింది. రాజు యాదవ్ అనే కాంగ్రెస్ నేత అనుచరులు ఏకంగా రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ల ఫోటోలతో ఓ ఫెక్సీ ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైతే 30ఏళ్లుగా నిరంతరాయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజు యాదవ్ కే టికెట్ కేటాయించాలని మనవి అంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. అది చూసిన వారంతా ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం తేలకముందే ఈ ముందస్తు కోయిల కూతలు ఎందుకంటూ సెటైర్లు సంధిస్తున్నారు. మరికొందరు మాత్రం కాంగ్రెస్ లోని వర్గపోరుకు ఇది నిదర్శనమని కామెంట్ చేశారు. అయితే రెండు రోజులుగా ఉన్న ఈ ఫ్లెక్సీని గురువారం ఎవరో తొలగించేయడం నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరుకు మరింత ఆజ్యం పోసినట్లయ్యింది.

Related posts