ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం వైపు ఎన్డీయే సర్కారు మొగ్గు
– తాజాగా ఇదే అంశంపై సదస్సుకు హాజరైన వెంకయ్యనాయుడు.
– ఇందిరాగాంధీ తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారని వెల్లడి
– దాంతో అసెంబ్లీ ఎన్నికల సమయాలు మారిపోయాయని వివరణ.
– అంతకుముందు 1967 వరకు జమిలి ఎన్నికలు జరిగాయన్న వెంకయ్య.
విజయవాడ మార్చి 29(ప్రజాక్షేత్రం):పార్టీల ఫిరాయింపులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయ పార్టీల నేతలు వారి అజెండా ప్రాతిపదికన ఎన్నికలకు వెళ్లేవారని అన్నారు. ఇప్పుడు కేవలం కొంతమంది నాయకుల పేర్లతో వెళ్తున్నారని చెప్పారు. అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తామని చెప్పేవాళ్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు పార్టీలు మారడం బాగా అలవాటుగా మారిందన్నారు. పార్టీ ఫిరాయింపులు అనేవి ప్రజాస్వామ్య విరుద్దం.. ఇటీవల మంచినీళ్లు తాగినంత ఈజీగా పార్టీ మారిపోతున్నారని వెంకయ్యనాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు.
– ఆ చట్టం తేవాలి..
ఆ పార్టీలో వారు ఇటు.. ఈ పార్టీలో వారు అటు.. రావడం పరిపాటిగా మారిందని వెంకయ్యనాయుడు హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ ఫిరాయింపులను నిషేధిస్తూ… చట్టం తేవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో లొసుగులు ఉండటంతో.. వాటిని చూసుకుని మారిపోతున్నారని విమర్శించారు. పార్టీ మారినా పదవులు తీసుకోకుండా ఉంటే… అది ఉల్లంఘన కింద రాదంట అని చెప్పారు. ఎంతమంది పార్టీలు మారినా… ఆ పదవికి రాజీనామా చేయాలనే విధంగా చట్టం చేయాలని అన్నారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించేలా చట్టం అమలు చేస్తేనే.. పార్టీలు మారే విధానం పోతుందని వెంకయ్యనాయుడు చెప్పారు.
– ప్రజల ఆలోచన మారాలి..
‘ప్రజల ఆలోచన విధానంపైనా వెంకయ్యనాయుడు వ్యంగోక్తులు చేశారు. సెలెక్షన్, కలెక్షన్, ఎలెక్షన్ అనే విధానం వల్ల దేశానికి, ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు అది ఫ్రీ, ఇది ప్రీ అని అధికారం కోసం ప్రజలను మాయ చేస్తున్నారు. ఉచితంగా ఇస్తామంటే ఎవరూ కాదనరు.. రాజకీయ పార్టీల నేతలు అందుకే ఉచిత హామీలు ఇస్తున్నారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండాక్టు ఉన్న వారినే ప్రజలు ఎన్నుకోవాలి. కానీ ప్రజలు కూడా క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ.. చూడటం విచారకరం. ఆ నాలుగు సీలు పోయి.. ఈసీలనే ఇప్పుడు చూస్తున్నారు. కులం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రయోజనం పొందిన వారు కూడా ఉన్నారు. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి.. తాత్కాలికంగా ఇచ్చేవాటిని నిలిపివేయాలి. ప్రజలు కూడా ఉచితాలకు ఆశపడి.. మీ పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయొద్దు’ అని వెంకయ్యనాయుడు హితవు పలికారు.
– పెట్టిన పెట్టుబడి రాబడుతారు..
‘ప్రజల్లో వచ్చిన మార్పును గమనించి రాజకీయ పార్టీలు నడుచుకోవాలి. ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే రూ. 20 నుంచి రూ. 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంత డబ్బు పెట్టుబడి పెడితే.. వాటిని రాబట్టుకునేందుకే చూస్తారు. మన భవిష్యత్‌కు మనం ఓటు వేస్తున్నామనేది ప్రజలు ఆలోచన చేయాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రూ. 55వేల కోట్లు ఖర్చుగా అంచనా వేశారు. 2024 ఎన్నికల్లో రూ. 1.35 లక్షల కోట్లు ఖర్చు అయినట్లు నిర్ధారించారు. ఇంటింటికీ పోయి రాజకీయ నాయకులు ఏం చేస్తారో తెలుసుగా.. అవి లెక్కేస్తే.. చెప్పక్కర్లేదు. అందుకే ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం ద్వారా ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఖర్చు తగ్గుతుంది. రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన కమిటీ దీనిపై అధ్యయనం చేసింది. టెక్నాలజీ పెరిగింది కాబట్టి… ఎన్నిక నిర్వహించడం ఇంకా సులువు అవుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నికను అందరూ సమర్ధించడం ద్వారా దేశాభివృద్ధికి సహకారం అందించాలి’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు