నా మీద ఎన్నో కుట్రలు జరిగాయి:జగ్గారెడ్డి
హైదరాబాద్, మార్చి 30(ప్రజాక్షేత్రం):తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తనపై ఎన్నో కుట్రలు జరిగాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. తన జీవితంలో జరిగిన అంశాలనే ఈ సినిమాలో చూపిస్తున్నామన్నారు. శ్రీ విశ్వమస నామ ఉగాది పర్వదినం పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఆయన తన మూవీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తూర్పు జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. తన రాజకీయ జీవిత కథను తానే రాసుకున్నానన్నారు. ఎవరో రాసిన కథల్లో హీరోలు నటిస్తారని.. పోలీసులను కొట్టినట్లు, వాళ్లతో ఫైట్ చేసినట్లు నటిస్తారని ఆయన వివరించారు. కానీ తన నిజ జీవితంలో ఇవన్నీ తాను చేశానని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో తన జీవితంలో కొన్ని సంఘటనలు వేరే వాళ్లతో చేస్తూ.. తాను కూడా రోల్ ప్లే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా కార్యాలయమే ఇకపై తన అడ్డా అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర.. సక్సెస్ పుల్ ప్రయాణం సినిమాలోనూ అదే విధంగా ఉంటుందన్నారు. ఇది తన ఒరిజినల్ క్యారెక్టర్ అని ఆయన స్పష్టం చేశారు. పోలీసులను కొట్టినట్లు హీరోలు నటిస్తారని.. కానీ తనవి ఒరిజినల్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్తి నేతగా, కౌన్సిలర్‌గా, మున్సిపల్ ఛైర్మన్‌గా తాను ఎదురుకొన్న కష్టాలు, బాధలు ఇవన్నీ చూపించనున్నారని తెలిపారు. తన రాజకీయ జీవిత కథను తానే రాసుకున్నానన్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టన్ అన్ని తానే రాసుకున్నానని చెప్పారు. అయితే ఓ ఫంక్షన్‌లో ఈ సినిమా డైరెక్టర్ రామానుజం తనను కలిశాడని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తాను కొన్ని సంవత్సరాల క్రితం ఒక కథను రాసుకున్నానని.. అందులో మీ పాత్ర ఉండాలనుకుంటున్నానని పేర్కొన్నాడని తెలిపారు. డైరెక్టర్ రామానుజం చెప్పిన పాత్ర తన నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన చూపించిన తన పోస్టర్ తనను అట్రాక్ట్ చేసిందని.. అప్పుడే ఈ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన వివరించారు. ఈ చిత్రానికి మూల కారకుడు డైరెక్టర్ రామానుజమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో తెరకెక్కుతోన్న చిత్రంలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే.