Praja Kshetram
జాతీయం

నీ ఓపికకు ఓ దండం.. 50వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

నీ ఓపికకు ఓ దండం.. 50వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

 

 

ఉత్తరప్రదేశ్ మార్చి 30(ప్రజాక్షేత్రం):మాతృత్వం ఆడవారికి లభించిన గొప్ప వరం అని చెబుతారు. అమ్మవ్వడంలోనే ఆడదాని జీవతానికి సార్థకత ఉంది అంటారు. ఒకప్పుడు ముగ్గురు, నలుగురేసి పిల్లలను కనేవారు. అయితే మారుతున్న కాలం, పరిస్థితులు, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని.. ఈ కాలం దంపతులు ఒక్కరు ముద్దు లేదంటే అసలే వద్దు అంటున్నారు. మరి కొందరికేమో.. పిల్లలంటే ఎంత ప్రేమ ఉన్నా.. అనేక కారణాల వల్ల తల్లిదండ్రులు అయ్యే అదృష్టం లేక.. ఆస్పత్రుల చుట్టూ తిరగుతున్నారు. ఒక్క బిడ్డను కనడానికి ఇష్టం లేని వారి గురించి.. లేక ఒక్క బిడ్డ కూడా పుట్టని వారి గురించి మనకు తెలుసు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ.. మాత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకంటే ఆమె ఒక్కరు, ఇద్దరు కాదు ఏకంగా 14 మంది పిల్లలకు జన్మనిచ్చింది. తాజాగా తన 50వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హాపూర్‌ జిల్లా, మోహల్లా బజరంగ్‌పూర్‌కు చెందిన ఇమాముద్దిన్ అనే వ్యక్తి భార్య గుడియా.. తన 50 వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను ముందుగా పిల్ఖువా సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు గుడియాను మేరఠ్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే గుడియాకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమె పరిస్థితి విషమించింది. దాంతో అంబులెన్స్ సిబ్బంది.. వాహనాన్ని పక్కకు ఆపి.. గుడియాకు డెలివరీ చేశారు. ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అంబులన్స్ సిబ్బంది.. గుడియా, అప్పుడే పుట్టిన పసికందును ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు.. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే తనకు 14 మంది బిడ్డలు అనే విషయాన్ని గుడియా ఖండించింది. తనకు 9 మంది మాత్రమే సంతానం ఉన్నారని.. వారిలో నలుగురు మగపిల్లలు కాగా.. మిగతా ఐదుగురు ఆడపిల్లలు అని తెలిపింది గుడియా. అయితే మరో నలుగురు పిల్లలు చనిపోయారని చెప్పుకొచ్చింది. ఈవిషయంపై మీరఠ్ ఆస్పత్రిలో గుడయాకు వైద్యం అందించిన డాక్టర్ స్పందిస్తూ.. గుడియా తన 14వ బిడ్డకు జన్మనిచ్చింది అనేది అక్షరాల నిజమని తెలిపింది. ఆమెకు ఇది 14వ డెలివరీ అని ప్రకటించింది.

Related posts