దైవదర్శనానికి వచ్చిన మహిళపై దారుణం
నాగర్‌కర్నూల్, మార్చి 31(ప్రజాక్షేత్రం):ఆడబిడ్డలకు ఎక్కడా రక్షణ లేదు అనేదానికి సాక్షంగా నిలిచింది నాగర్‌కర్నూల్ ఘటన. దైవదర్శనానికి వచ్చిన మహిళను కూడా వదలలేదు కామాంధులు. ప్రశాంతంగా దేవుడిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళకు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. కుటుంబంతో కలిసి దేవుడిని దర్శించుకునేందుకు వచ్చింది ఓ మహిళ. మొక్కులు తీర్చుకున్న తర్వాత ఆమెను అనుకోని ఆపద వెంటాడింది. తప్పించుకుందామనే లోపే కామాంధులకు బలైపోయింది మహిళ. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి దేవలయ సమీపంలో దారుణం జరిగింది. దైవదర్శనానికి వచ్చిన ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత శనివారం ఓ కుటుంబం ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చింది. కుటుంబసభ్యులంతా స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇంతలోనే ఆ కుటుంబంలోని ఓ మహిళ బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బంధువును వెంట పెట్టుకుని మహిళ బహిర్భూమికి వెళ్లింది. కానీ ఆ కుటుంబం వచ్చినప్పటి నుంచి ఆ ఊరలోని కొందరు వ్యక్తులు మహిళపై కన్నేశారు. అవకాశం కోసం ఎదురు చూశారు. మహిళ బహిర్భూమికి వెళ్తున్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు… ఆమె వెంటే వెళ్లారు. ఆపై మహిళతో పాటు వచ్చిన బంధువుపై దాడి చేసి.. మహిళను పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. ఆమెపై ఎనిమిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ ఎంత ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అత్యాచారం అనంతరం ఆ కామాంధులు అక్కడి నుంచి పరారయ్యారు. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆరుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ విచారణ కొనసాగుతోందని.. వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అలాగే బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దైవదర్శనానికి వస్తే ఇంత దారుణానికి ఒడిగడతారా అంటూ బాధితురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళపై అత్యాచార ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.