బీఆర్ఎస్ మెడకు కంచ గచ్చిబౌలి భూముల వివాదం!
– అసలు దోషి బీఆర్ఎస్? మౌనంగా బీజేపీ!
– ఇప్పుడు స్థల రక్షణ పేరుతో విమర్శలు, ధర్నాలు
– 2017లో మై హోం కంపెనీకి 50 ఎకరాలు.
– ప్లాట్లు అమ్ముకునేందుకు 100 ఫీట్ల రోడ్డు!
హైదరాబాద్ ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అనుకుని ఉన్న 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల విషయం కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆరెస్, బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ భూముల అమ్మకాల విషయంలో అసలు దోషి బీఆరెస్సేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల విలువైన భూమి యూనివర్సిటీకి చెందినదని, వేలం పాటలో విక్రయించవద్దని విద్యార్థులతో పాటు బీఆర్ఎస్, బీజేపీ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఎటువంటి పంచాయితీ లేని భూములపై రెండు పార్టీలు విద్యార్థులతో రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ప్రతి విమర్శలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనల ప్రకారం.. తాజాగా చోటు చేసుకున్న భూ పంచాయితీలో తెరమీదకు సెంట్రల్ యూనివర్సిటీ పేరు రాగా, తెర వెనక సూత్రధారులు, పాత్రదారులు, కుట్రదారులు చేతులు కలిపి వివాదం రాజేస్తున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్ మాఫియాను పెంచిపోషించిన వాళ్లే ఈ గొడవలకు దిగుతున్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ కుట్రలను తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీకి 2,500 ఎకరాల భూమి సర్వే నంబర్ 25లో ఉంది. ఇందులో రెండు బిట్లు ఉండగా, ఒక బిట్‌ను ఐఎంజీ భారత్ అనే సంస్థకు కేటాయించారు. 2005లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూ కేటాయింపును రద్ధు చేసింది. రద్దులపై సదరు సంస్థ కోర్టును ఆశ్రయించగా, అప్పటి నుంచి వివాదం నడుస్తోంది. ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో బహిరంగ మార్కెట్ లో వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని పక్కనబెడితే, దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టాయని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
2014లో ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ గుట్టు చప్పుడు కాకుండా భూములను తనవాళ్లకు కట్టబెట్టే పనులకు శ్రీకారం చుట్టిందని సమాచారం. ఈ భూములపై మై హోం కంపెనీ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు కన్నుపడిందని అంటున్నారు. ఈ భూములపై వివాదం నడుస్తుండగానే ఏమాత్రం పట్టించుకోకుండా 50 ఎకరాల భూమి వివాదం రామేశ్వర్ రావు దృష్టికి వచ్చిందని తెలుస్తున్నది. వెంటనే ఆయన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముందు పెట్టారు. ఏమాత్రం ఆలోచించకుండా కేటీఆర్ రంగప్రవేశం చేసి ఆ 50 ఎకరాల పంచాయతీని సెటిల్ చేసి రామేశ్వర్ రావు పరం చేశారని చెబుతున్నారు. ఈ భూమిలోనే మై హోం విహంగ పేరుతో బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పూర్తయింది కూడా. ఈ బహుళ అంతస్తుల భవనం కోసం ఆనాటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వంద పీట్ల రోడ్డు కూడా వేయించారు. ఇంతటి విలువైన భూములను మై హోం సంస్థ యజమాని జూపల్లి రామేశ్వర్ రావుకు ధారాదత్తం చేసినప్పుడు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి వేల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నప్పుడు కేటీఆర్‌కు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డికి తెలియదా అని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని, భవనాల రాకతో పర్యావరణానికి హాని కలుగుతుందని, వన్యప్రాణులకు ప్రమాదం వాటిల్లుతుందని గ్రహించలేకపోయారా? అని ప్రభుత్వ పెద్దలు లేవనెత్తుతున్నారు. ఈ విషయంలో రెండు పార్టీలు రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నాయో తెలియడం లేదు. జూపల్లి రామేశ్వర్ రావు మై హోం విహంగ నిర్మాణం చేస్తున్నప్పుడు లేవని గొంతులు ఇప్పడు ఎందుకు లేస్తున్నాయో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవి ప్రభుత్వ భూములని తీర్పు ఇచ్చిన తరువాత కూడా బీఆర్ఎస్ బాటలో బీజేపీ ఎందుకు నడుస్తున్నదని ప్రశ్నించారు. ఇక్కడే కుట్రకోణం దాగి ఉంది. గతంలో 50 ఎకరాలను కేటాయించిన విధంగానే ఈ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను ఏదో విధంగా రామేశ్వర్ రావుకు దక్కాలనే ముందుచూపుతో రెండు పార్టీలు కూడబలుక్కుని ధర్నాలకు దిగాయని అంటున్నారు. ఇప్పటికైనా మై హోం విహంగ నిర్మాణాలను కూల్చివేయాలనే డిమాండ్ చేసే దమ్ము, ధైర్యం కేంద్ర మంత్రులు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డి తో పాటు కేటీఆర్ కు ఉందా? అని కాంగ్రెస్ పెద్దలు ప్రశ్నిస్తున్నారు.