రెవెన్యూలో అక్రమ వసూళ్లు
మల్హర్ ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం): మండలంలోని రెవెన్యూ శాఖలో ఓ అధికారి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నట్లు పలువురు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. పనికి ఓ రేటు ఫిక్స్ చేసుకొని పైసలు ఇస్తే చాలు ఎంతటి మాయాజాలానికైనా తెగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాట్లు, జెండా పండుగ లాంటి ఏ ఇతర కార్యక్రమాలైనా ఖర్చులకు సదరు రెవెన్యూ అధికారి అదనపు వసూళ్లపై కన్నేయడం చర్చనీయాశమైంది. మల్హర్ మండలంలోని తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయంలోని ఓ అధికారి తీరుతో ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. సర్టిఫికెట్ల నుండి మొదలుకొని, ల్యాండ్ రిజిస్ట్రేషన్ తదితర పనులకు కోసం వచ్చిన ఎంతోమంది రైతుల నుండి రూ.5 నుండి రూ.10 వేల వరకు ఓ కీలక అధికారి వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. కార్యాలయం ఎక్స్పెండేచర్ పేరిట కార్యాలయంకు వివిధ పనులకు వచ్చే వారి వద్ద నుండి రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎదురు చెప్పిన తోటి సిబ్బందికి సంబంధం లేని పనులు అప్పగించి వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. సదరు అధికారి రెవెన్యూ వసూళ్ల మాయాజాలానికి బలైన లబ్ధిదారులు ఎందరో ఉన్నారు.
కాగా పనులు చేసిన లబ్దిదారుల నుండి ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కీలక అధికారి కార్యాలయ కింది స్థాయి ఉద్యోగులపై తరచుగా గుర్రుగా ఉంటూనే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మహాదేవపూర్ మండలంలో డీటీగా పనిచేసిన సందర్భాల్లోనూ పలు అవినీతి ఆరోపణలు రావడంతో శాఖ పరమైన చర్యలకు గురైనట్లు సమాచారం. అయితే ఇటీవల కార్యాలయ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తూ ఓ మహిళ ఉద్యోగిపై లైంగికంగా వేధిస్తున్నాడని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి రాగా ఆ సమయంలో కలెక్టర్ లేకపోవడంతో కలెక్టరేట్ ఏవో మొయినోద్దీన్ ఖాజాకు గత శనివారం ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఫిర్యాదు చేసిన విషయం పొక్కడంతో ఎవరా అధికారి అంటూ జిల్లాలోని తహసీల్దారులు హైరానా పడ్డారు. చేసిన తప్పులకు తనపైనే ఫిర్యాదు చేసినట్టు తెలుసుకున్న ఆ అధికారి కాళ్ల బేరానికి దిగినట్లు తెలిసింది. గతంలో కిందిస్థాయి సిబ్బందిపై మండిపడిన తత్వంపై సమాచారం తెలిసిన జిల్లా కలెక్టర్ కూడా గట్టిగా మందలించి వదిలేసినా వక్రబుద్ధి మారలేదని తెలిసింది. ప్రతిపనికి ఓ రేటు నిర్ణయించి ప్రజలను వేధిస్తున్నాడని కలెక్టర్కు గతంలో కూడా ఫిర్యాదులు అందినట్లు సమా చారం. బాధిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు నేపథ్యంలో ఆయన సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం. సదరు అధికారికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం విచారించి శాఖపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. దీంతో ఇక బదిలీ తప్పకపోవచ్చు.