కొండకల్ గ్రామం లో ‘చెత్త’ లో వీరన్న చెరువు.
– పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు.
-దుర్వాసన మరియు పాములతో నిండిపోయిన చెరువు.
శంకర్ పల్లి ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఉన్న వీరన్న చెరువు రోజు రోజుకు చెత్తలా మారిపోతుంది. వీరన్న చెరువు గ్రామ నడి మధ్యలో ఉండడంతో చుట్టుపక్కల ఉండే ప్రజలు చెత్తను తీసుకువచ్చి చెరువులోనే వేస్తున్నారు. అలా వేయడం వలన మంచినీరు కాస్త మురికి నీరుగా మారిపోయి చెరువు దుర్వాసనతో మరియు వివిధ రకాల పాములతో, వివిధ రకాల చెట్లు మొలకెత్తి చెరువు కనిపించకుండా మూసుకుపోయింది. చెరువులో కొంత భాగం మూసేసి గ్రామానికి ఉపయోగపడేలా మార్కెట్ యార్డ్ ను నిర్మించారు. మార్కెట్ యార్డ్ నిర్మించినా ఫలితం లేకుండా పోయింది. చెరువు చుట్టూ ఉన్న చెరువు కట్టపై గ్రామంలో పనిచేసే వివిధ పనివారికి షటర్లు ఏర్పాటు చేసారు, దాని వలన కూడా కొంత నష్టమే జరుగుతుంది. చెరువు పక్కనే ప్రజల ఇండ్లు ఉండడంతో వివిధ రకాల భయాందోళనలకు దుర్వాసనకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో వీరన్న చెరువు ఈ పరిస్థితికి చేరుకున్నా ఇరిగేషన్ అధికారులు ఏ ఒక్కరోజు వచ్చి తనిఖీ చేసింది లేదు. వారు పట్టించుకోకపోవడంతోనే వీరన్న చెరువుకు ఈ పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించి వీరన్న చెరువు పై పనులు చేపట్టి చెరువు పునరుద్ధీకరణ చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.