బాలాపూర్లో బెల్టు షాపులు మూసివేయాలని గ్రామస్థుల తీర్మానం..
బడంగ్ పేట్ ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం):బాలాపూర్లో బెల్టు షాపులు మూసివేయాలని అఖిలపక్ష పార్టీల నేతలు, బస్తీ సంఘాల నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. బాలాపూర్ గ్రామంలో సమావేశమైన అఖిలపక్ష పార్టీల నేతలు, బస్తీ సంఘాల పెద్దలు సమావేశమై అందరి సమక్షంలో తీర్మానం చేశారు. అనంతరం తీర్మానం ప్రతిని బాలాపూర్ పోలీసులకు అందజేశారు. ఇక నుంచి బాలాపూర్ గ్రామంలో బెల్టుషాపులు నడిపించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రాహం శేఖర్ మాట్లాడుతూ బాలాపూర్లో బెల్టుషాపులు, గంజాయి వ్యాపారాన్ని నిషేధించినట్లే బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోను బెల్టు షాపులు, గంజాయి వ్యాపారం పై ఉక్కుపాదం మోపడానికి అఖిలపక్ష పార్టీల నేతలతో పాటు బస్తీ సంఘాల నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ లోని ఉరుకొండ మండలంలో ఓ మహిళ పై గ్యాంగ్ రేప్ ఘటన బెల్టుషాపుల నుంచి తెచ్చుకున్న మద్యం సేవించాకే జరిగిందని, ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందన్నారు. మద్యం విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో లభిస్తుండడంతో స్థానిక యువకులు మద్యానికి బానిస అవుతున్నారన్నారు. పలువురు రోగాలు, ప్రమాదాల భారిన పడుతున్నారని, మద్యం బెల్టు షాపులతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. అర్ధరాత్రి వరకు బెల్టుషాపులు నిర్వహిస్తుండడంతో ఇంటికి వచ్చిన మహిళలను దుర్భాషలాడుతూ, వేధిస్తూ, కొడుతూ మానసిక ప్రశాంతత లేకుండా చిత్రహింసలు పెడుతున్నారని పేర్కొన్నారు.
– మీ ఒక్క కుటుంబం బాగుపడితే.. 100 కుటుంబాలు నాశనమవుతున్నాయ్..
బెల్టుషాపుల కారణంగా మీ ఒక్క కుటుంబం బాగుపడితే, మిగతా 100 కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. మీరు నడిపే బెల్టు షాపుల వలన భానిసగా మారుతున్న తాగుబోతులు మీ ఇంటి ఆడవాళ్లపైన కూడా దాడి జరిగే అవకాశం ఉందన్నారు. తాగు బోతుకు మీ.. మా కుటుంబం అంటూ తేడా ఉండదని మత్తులో ఆడ అని కనిపిస్తే చాలు వదలడం లేదన్నారు. సమాజంలో బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నా.. బెల్టుషాపునే ఎన్నుకోవడం సరైన పద్దతి కాదని, మరొక్కసారి బెల్టు షాపు యజమానులు ఆలోచించి బెల్టుషాపుల మూసివేతకు బాలాపూర్ గ్రామస్థులకు సహకరించాలని ఇబ్రహం శేఖర్ విజ్ఞప్తి చేశారు.