Praja Kshetram
తెలంగాణ

అత్యంత ఎత్తైన బస్ కండక్టర్ ఇతనే.. అతని ఇబ్బందులు చూస్తే బాబోయ్..

అత్యంత ఎత్తైన బస్ కండక్టర్ ఇతనే.. అతని ఇబ్బందులు చూస్తే బాబోయ్..

 

 

హైదరాబాద్ ఏప్రిల్ 05(ప్రజాక్షేత్రం): ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలు ప్రతి ఒక్కరూ ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడూ ప్రభుత్వ కొలువు సాధిస్తామా? అని చాలా మంది ఏళ్ల తరబడి ఆతృతగా నిరీక్షిస్తుంటారు. నిద్రలేని రాత్రిళ్లు గడుపుతూ.. తిండి మానేసి మరీ గంటల తరబడి చదువుతుంటారు. అదృష్టం కలిసి వచ్చి ఉద్యోగం వచ్చిందే అనుకో.. ఇక వారి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అయితే ప్రభుత్వం ఉద్యోగం వల్ల ఓ వ్యక్తి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మీకు తెలుసా. ఈ అవస్థలు పడలేను బాబోయ్ అంటూ సదరు వ్యక్తి వాపోతున్నాడు. అసలు అతను ఎవరు, ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హైదరాబాద్ చంద్రయణ్ గుట్టకు చెందిన అమీన్ అహ్మద్ అన్సారీ.. మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నారు. మంచి ఉద్యోగం, జీతంతో భార్య, పిల్లలు అంతా హ్యాపీ. కానీ, అతను మాత్రం కండక్టర్ ఉద్యోగం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అదేంటి అనుకుంటున్నారా?. అందుకు కారణం ఉద్యోగ ఒత్తిడో, పైఅధికారుల వేధింపులో కాదు.. కేవలం అతని ఎత్తు.. అవును ఇది నిజం. అహ్మద్ తన ఎత్తు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే తన హైట్ ఏకంగా ఏడు అడుగులు.. కానీ, బస్సులో నిల్చోటానికి ఉండే ఎత్తు కేవలం ఆరు అడుగులు. అహ్మద్ నిల్చుంచే బస్సు పైకప్పు అతని తలకు తగలటమే కాకుండా మెడ వంచి మరీ నడవాల్సిన పరిస్థితి. దీంతో అతను మెడ, వెన్ను నొప్పితో తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ మందు బిల్లలు మింగుతున్నాడు. 2021 వరకూ తన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టెబుల్‌గా పని చేసేవారని, అతను మృతిచెందడంతో కారణ్య మరణం కింద తనకు కండక్టర్ ఉద్యోగం వచ్చినట్లు అహ్మద్ చెప్తున్నారు. అయితే తన హైట్ కారణంగా బస్సులో నిల్చోలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు అహ్మద్. ప్రతి రోజూ 5 ట్రిప్పులకు గాను దాదాపు 10 గంటలపాటు నిల్చోవాల్సి వస్తోందని, దీంతో మెడ, వెన్ను నొప్పి, నిద్రలేమి సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని పరిస్థితి చూసిన ప్రయాణికులంతా అయ్యో ఎంత కష్టం వచ్చిందోనంటూ సానుభూతి చూపుతున్నారు. ఆర్టీసీలోనే అతనికి మరేదైనా ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Related posts